హక్కులతో పాటు బాధ్యతల కోసం పరిశ్రమించాలి

– రేపటి భారతావనిలో నైతిక విలువలు పెంచాలి : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హక్కులతో పాటు బాధ్యతల కోసం పరిశ్రమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎస్‌టీయూటీఎస్‌ 78వ వార్షిక కౌన్సిల్‌ సమావేశాలు పర్వతరెడ్డి అధ్యక్షతన జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి భావి భారతావనిలో నైతిక విలువలు పెంచాల్సిన బాద్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. ఉపాధ్యాయులకు హక్కులతో పాటు ప్రశ్నించే తత్వాన్ని సామాజిక కోణాన్ని అలవాటు చేయడం మంచి పరిణామమన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొనసాగడం, క్షేత్రస్థాయిలో అసంబద్ధతలను విధానాలను సలహాలను సూచనలను ప్రభుత్వానికి నివేదించడం అభినందనీయమన్నారు. రాజ్యాంగ విలువల కోసం పరిశ్రమించే వారికి అన్ని రకాల మద్దతు లభిస్తుందని హామీ ఇస్తూ ఇటీవల విద్యార్థులు ఉపాధ్యాయులపై దాడి చేయడం బాధాకరమన్నారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రేపటి తరానికి నైతిక విలువలను పెంపొందించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగం, ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా ఉండడం శుభసూచకమన్నారు. సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. సంఘం పూర్వ అధ్యక్షులు ఏపీ మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ బలపరిచిన, జాక్టో ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి పూల రవీందర్‌,ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్‌, ఎస్‌టీయూ ఏపీ అధ్యక్షులు సాయిశ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు.