– సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ
నవతెలంగాణ – బంజారా హిల్స్
మహిళా వికలాంగులకు సంక్షేమం, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ తెలిపారు. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 23, 24 తేదీల్లో జరగనున్న మహిళావికలాంగుల రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని కమిషనర్ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా వికలాంగులు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. వైకల్యం శరీరానికే తప్ప మనస్సుకు కాదన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తే వికలాంగులు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తారని చెప్పారు. వికలాంగులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహిళా వికలాంగులపై వేధింపుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వికలాంగుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేకంగా మహిళా వికలాంగులతో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ మాట్లాడుతూ.. దేశంలో మహిళలు, మహిళా వికలాంగులపై రోజురోజుకూ వేధింపులు, లైంగికదాడులు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్న అంశాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 4లక్షల మంది మహిళా వికలాంగులు ఉన్నారన్నారు. మహిళా మానసిక వికలాంగులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3(బి), (డి)లను మహిళా వికలాంగులు వినియోగించుకోవడం లేదని.. వారు హక్కులు, రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళావికలాంగుల రాష్ట్ర సదస్సుకు 33 జిల్లాల నుంచి 500మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్, ఎన్పీఆర్డీ రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.శశికల, టీఏఎస్ఎల్పీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కె.నాగేందర్, డాక్టర్ ఈమధ్ ఖాన్ రుమాని, కోశాధికారి డాక్టర్ ఆరిఫ్, డాక్టర్ గంగరాజు, ఎన్పీఆర్డీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా నాయకులు రేణుక, విజయలక్ష్మి పాల్గొన్నారు.