కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి

–  సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌పాషా అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బి స్టాలిన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్‌ పాషా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అత్యంత నిరంకుశంగా అవినీతి పాలనను అందిస్తున్నారని విమర్శించారు. బీజేపీ విభజన విషపూరిత రాజకీయాలను ప్రజలు చూసి ఆ పార్టీని తన్ని తరిమెందుకు సిద్ధమయ్యారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజావ్యతరేక విధానాలను అవలంబిస్తున్నాయని చెప్పారు. పదేండ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిలువునా మోసం చేస్తున్నాయని విమర్శించారు. తోడు దొంగలైనా బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఈ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మతాన్ని అడ్డంపెట్టుకొని మైనార్టీ లను అభివృద్ధికి దూరం చేస్తున్న ఎంఐఎంను కూడా ఓడిం చాలన్నారు. మలక్‌పేట కాంగ్రెస్‌ అభ్యర్థి షేక్‌ అక్బర్‌ మాట్లాడుతూ సీపీఐ మద్దతు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు ప్రకటించారు. తనను ఎమ్యెల్యేగా గెలిపిస్తే మలక్‌పేట ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ ఛాయాదేవి, జిల్లా సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, నాయకులు బాలకృష్ణ, ఎస్‌ఏ మన్నన్‌, చైతన్య, ఏఐవైఎఫ్‌ అధ్యక్షులు వలీ ఉల్లాV్‌ా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నిర్లేకంటి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.