– ఏటేటా ‘ఉపాధి హామీ’ నిధుల కుదింపు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వీర్యం
– వంద రోజుల పనిదినాలు అందని ద్రాక్ష
– జాబ్ కార్డుల కోత.. సభ్యుల తొలగింపు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ పేదలకు వరప్రదాయినిగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వీర్యం చేస్తున్నాయి. పేదలకు పని కల్పించేందుకు ఇవ్వాల్సిన నిధులు రాష్ట్రంలోనూ దారి మళ్లుతున్నాయి. ఐదారు నెలలైనా వేతన బకాయిలివ్వడం లేదు. కూలీలకు మాత్రమే పని కల్పించే పనులు చేయాల్సింది పోయి యంత్రాలతో చేసే పనులకు నిధుల్ని ఖర్చు చేస్తున్నారు. ఏటేటా నిధుల్ని తగ్గిస్తు న్నారు. కొత్త జాబ్ కార్డులివ్వ కపోగా పాత కార్డుల్ని రద్దు చేస్తున్నారు. నమోదైన కూలీల పేర్లను తొలగిస్తున్నారు. ఏడాదిలో కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించాలని చట్టంలో ఉన్నా ఏ ఒక్క కుటుంబానికి పని చూపలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే అనేక పథకాలకు ఉపాధి హామీ నిధుల్ని మళ్లిస్తూ కూలీలకు పని చూపట్లేదన్న విమర్శలున్నాయి. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనే పేదల డిమాండ్‌ను పాలకులు విస్మరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేల ఉపాధి హామీ పథకంలో పేదలకు పని గ్యారంటీ లేని వైనాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధి హామీ చట్టం అమలు తీరు.. దాని ఉనికికే ప్రశ్నార్ధకంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులుండగా వీటిల్లో 4.8 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. మెదక్ జిల్లాలో 1.10 లక్షల జాబ్‌కార్డులుండగా వీటిల్లోనూ 2 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 2.10 లక్షల జాబ్‌కార్డులుండగా వీటిల్లో 4.10 లక్షల మంది కూలీల పేర్లు నమోదై ఉన్నాయి. జాబ్‌కార్డులు, కూలీల సంఖ్యల వివరాలు అధికారిక రికార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ వారందరికీ వంద రోజుల పాటు పని దినాలు కల్పిస్తున్న పరిస్థితి లేదు. పైగా జాబ్‌కార్డుల్ని రద్దు చేస్తూ వస్తున్నారు. దాంతో నమోదైన కూలీల పేర్లు కూడా తొలగించబడుతున్నాయి. జాబ్‌కార్డు కోసం తెల్లకాగితంపై దరఖాస్తు ఇస్తే వెంటనే కార్డు ఇవ్వాలని చట్టం చెబుతున్నా అధికారులు మాత్రం అనేక కొర్రీలు పెట్టి కార్డులివ్వడంలేదు. పని చేయగల్గిన కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు తగ్గకుండా కల్పించాల్సి ఉన్నా ఏ ఒక్క ఊర్లోనూ వంద రోజుల పని కల్పించడంలేదు. ముఖ్యంగా కూలీలతో చేయించే పనులకు కాకుండా యంత్రాలతో చేసే పనులకు ఈజీఎస్ నిధుల్ని వెచ్చిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, రైతులకు కల్లాలు, రైతు వేదికలు, వర్మీ కంపోస్టు, నీటి గుంతల తవ్వకం, పశువులు, మేకల పాకల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, ప్రకృతి వనాలు, మన ఊరు మన బడి పేర స్కూళ్ల అభివృద్ధి వంటి పనులకు జాతీయ ఉపాధి హామీ నిధుల్ని ఖర్చు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
జాబ్‌కార్డుల రద్దు.. కూలీల పేర్ల తొలగింపు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్త జాబ్‌కార్డులివ్వడం కంటే రద్దు చేస్తున్నవే అధికంగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.39 లక్షల జాబ్‌కార్డులుండగా ఇందులో పని కోసం రావట్లేదన్న నెపంతో సంగారెడ్డి జిల్లాలో యాక్టివ్‌గా లేని కుటంబాలు 89 వేలు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా 2.30 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా లేరన్న పేరుతో పని కల్పించడంలేదు.
జాబ్‌కార్డుల తొలగింపు, జోడింపు అనేది గ్రామ సభలో చర్చించి ఆమోదం పొందాలి. కానీ..! నకిలీ జాబ్‌కార్డులు, పని చేయడానికి ఇష్టపడకపోవడం, గ్రామం నుంచి వలస వెళ్లిపోవడం వంటి కారణాలు చూపి జాబ్‌కార్డుల్ని తొలగిస్తున్నారు. సిద్దిపేట జిల్లాల్లోనూ ఇదే విధంగా సగం జాబ్‌కార్డుల్ని ఇన్‌యాక్టివ్ పేరిట పని కల్పించకుండా రద్దు చేసే పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల వరకు జాబ్‌కార్డులకు పని కల్పించని పరిస్థితి నెలకొంది. వరుసగా పనికి రాని కుటుంబాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి తర్వాత వాటిని రద్దు చేస్తున్నందున ఏటేటా జాబ్‌కార్డుల కుదింపు జరుగుతోంది. జాబ్‌కార్డుల్ని కుదించడంతో పాటు కూలీల పేర్లను కూడా తొలగిస్తున్నారు.
అందని ద్రాక్ష.. వంద రోజుల పని
ఒక్కో ఊరిలో జాబ్ కార్డులున్న కుటుంబాలన్నింటికీ కనీసం వంద రోజుల పాటు పని కల్పించాల్సి ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలో వంద రోజుల పని దినాలు కల్పించిన లెక్కల్ని పరిశీలిస్తే… పట్టుమని పది కుటుంబాలకు కూడా వంద రోజుల పని చూపలేదు. సంగారెడ్డి జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న కూలీలుగా గుర్తించిన 2.30 లక్షల మందిలో 2023-24 సంవత్సరంలో వంద రోజుల పాటు పని కల్పించిన కూలీలే లేరు. ఇక మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
నిధుల్లో కోత.. మళ్లింపు
ఉపాధి హామీ చట్టం అమలు కోసం ఏటా బడ్జెట్‌లో పెట్టే నిధుల్ని తగ్గిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కోత పెడుతుంది. ఆ మేరకు రాష్ట్రం వాటాను కూడా తగ్గిస్తుంది. నిధుల్ని తగ్గించడమే కాకుండా ఇతర పథకాల అమలు పేరిట నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. రాష్ట్రంలో మూసీ ఆధునీకరణ, హరిత హారం వంటి పథకాల కోసం ఈజీఎస్ నిధుల్ని మళ్లించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం బోర్డుల తయారీ, మైదానం ఏర్పాటు పనుల్లో ఏ ఒక్క కూలీకి కూడా పని చూపలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రకృతి వనాల్లోనే కూలీలకు కొన్ని రోజుల పని దొరికింది.
గ్రామీణ పేదల పట్ల పాలకుల కుట్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ పేదల పట్ల కుట్ర పూరితంగా వ్యవహారిస్తున్నాయి. ఏటా ఈజీఎస్‌కు బడ్జెట్‌లో కోత పెడుతున్నారు. పని చేయట్లేదనే పేరుతో జాబ్‌కార్డుల్ని రద్దు చేస్తున్నారు. ఇతర పథకాలకు నిధుల్ని మళ్లించడం వల్ల కూలీలకు పనిదినాలు దొరకట్లేదు. అరకొర పనిదినాలు కల్పించినా ఐదారు నెలల వరకు వేతనాలివ్వడలేదు. కూలీలు రోజంతా కష్టపడి పనిచేసినా రూ.150 కూలి కూడా ఇవ్వడంలేదు. ఉమ్మడి మెదక్‌లో మున్సిపాలిటీల ఏర్పాటు పేరిట వందల గ్రామాలను విలీనం చేశారు. ఆ గ్రామాల్లో పట్టణీకరణ జరగలేదు. పేదలకు మాత్రం మున్సిపాలిటీ గ్రామాల పేరిట ఉపాధి పనుల్ని కల్పించడంలేదు.
ఎం.నర్సింహులు, వ్యకాస జిల్లా కార్యదర్శి