కష్టపడండి.. విజయం మనదే..!

work hard.. Victory is ours..!– మెదక్‌ సీటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం
– ఇందిరా గాంధీ ప్రాతినిథ్యం వహించిన స్థానమిది
–  సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెదక్‌ లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మెదక్‌ లోక్‌సభ స్థానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్‌, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందనీ, బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని చెప్పారు. నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా అభ్యర్థి విజయానికి కృషిచేయాలన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో సానుభూతి పెరిగిందనీ, వాటిని విసృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు. పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో టీఎస్‌ఐఐసీ చైర్మెన్‌ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పఠాన్‌ చెరు, నర్సాపూర్‌, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ బాధ్యులు కాటా శ్రీనివాస్‌ గౌడ్‌, రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, పూజాల హరికష్ణ, తదితరులు పాల్గొన్నారు.