– లక్షం సాధించే వరకు విశ్రమించకండి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
– చిట్కుల్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో రాత్రి బస
నవ తెలంగాణ – పటాన్ చెరు
నిరుత్సాహ పడకుండా మీ గోల్ సాధించే వరకు విశ్రమించ వద్దని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విద్యార్థినీలకు సూచించారు.మండలం లోని చిట్కాల్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రాత్రి బస చేశారు.కలెక్టర్ రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించి, వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపాల్ కల్పన ను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల గదులను సందర్శించి, వారు చేస్తున్న అధ్యయనం, అందుకు అందుతున్న వసతులు వంటి వివరాలను సమీక్షించారు. పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందించిన పాఠ్య పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు లను పరిశీలించి, వారు సరైన విధంగా చదువుతున్నారా అనే విషయంపై దృష్టి పెట్టారు. అనంతరం కలెక్టర్ అన్ని తరగతి గదులను, డార్మెటరీలు, కిచెన్, డైనింగ్ హాల్ వంటి ప్రదేశాలను సందర్శించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు సరైన విధంగా ఉన్నాయా అన్నది పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతపై కూడా తనిఖీ చేశారు.విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారికి ఉన్న సమస్యలు, అభ్యర్థనలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యా విధానాలు ఎంతవరకు సరైన రీతిలో అమలవుతున్నాయో తెలుసుకోవడానికి కలెక్టర్ ఈ రాత్రి బస కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రంతా పాఠశాలలోనే ఉండి, విద్యార్థులతో కలిసి గడిపారు.ఈ సందర్శన ద్వారా విద్యా, వసతి, భోజన వంటి సదుపాయాలు బాగున్నాయా అని సమీక్షించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారి దేవుజా, తహసిల్దార్ రంగారావు, వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.