మరింత చురుగ్గా పనిచేయండి

– విద్యుత్‌ ఉద్యోగులకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ పిలుపు
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండేందుకు విద్యుత్‌ ఉద్యోగులు మరింత చురుగ్గా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్‌ పునరద్ధురణ చర్యల్లో ఎలాంటి జాప్యం లేకుండా, ఎప్పటి ఫిర్యాదుల్ని అప్పుడే పరిష్కరించాలనీ, దీనికోసం అన్ని విభాగాల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని చెప్పారు. శుక్రవారంనాడాయన హైదరాబాద్‌ మింట్‌ కాపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చీఫ్‌ జనరల్‌ మెనేజర్లు, జిల్లాలు, సర్కిళ్ల సూపెరింటెండెంట్‌ ఇంజినీర్లు, డివిజనల్‌ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై మాట్లాడారు. డిస్కం పరిధిలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు జిల్లాల్లో 2,770 స్తంభాలు, 34 ట్రాన్స్‌ఫార్మర్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 605 స్తంభాలు, 7 ట్రాన్స్‌ ఫార్మర్లు దెబ్బతిన్నాయనీ, వాటన్నింటినీ పునరుద్ధరించామని తెలిపారు. వరద ప్రభావం తగ్గాక, అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా సిబ్బంది హెడ్‌ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలనీ, స్టోర్స్‌, ఆపరేషన్‌ సిబ్బంది విధులు నిర్వహించాలని చెప్పారు. ముందస్తు భద్రతా చర్యలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూడాలని సూచించారు. విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం అన్ని జిల్లాలు, సర్కిళ్ల హెడ్‌ క్వార్టర్లలో, హైదరాబాద్‌లోని స్కాడా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ ప్రజలు, వినియోగదారులు విద్యుత్‌ పరికరాల పట్ల స్వీయ జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు సమీప విద్యుత్‌ కార్యాలయం లేదా కంట్రోల్‌ రూమ్స్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. సంస్థ మొబైల్‌ యాప్‌, ట్విట్టర్‌, పేస్‌ బుక్‌, 1912/ 100 కు కాల్‌ చేసి సమస్యలను తమ దష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డైరెక్టర్లు జే శ్రీనివాసరెడ్డి, సీహెచ్‌ మదన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.