పాఠశాలల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

పాఠశాలల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలి– పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పరిశీలన
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌
నవతెలంగాణ-దోమ
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. దోమ మండల పరిధిలోని బొంపల్లి, బాసుపల్లి గ్రామాలలో ఉన్నత, ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. దోమ మండలంలోని బొంపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో వంటగది, వరండా, వాటర్‌ సంప్‌, టాయిలెట్స్‌ తదితర నిర్మాణాలు, మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్‌ భగీరథ నీరు సరఫరా జరుగుతోందా, వాటర్‌ సప్లై కనెక్షన్‌ ఉందా, నీటి సరఫరా విషయమై వివరాలు సేకరించి రిపోర్ట్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చాలావరకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, ఇంకనూ పలు పాఠశాలల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. వర్షాకాలం సీజన్‌ అయినందున పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వన మహౌత్సవంలో భాగంగా పాఠశాలల ఆవరణలో మూడువరుసలు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం దోమ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి రోజూ ఓపికి ఎంత మంది వస్తున్నారు, అంబులెన్సు ఉందా, ఎంత మంది స్థాఫ్‌ ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చిన పేసెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఓపి స్లిప్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత డాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనంలో ఏర్పాటు చేసిన మహిళ సంఘాల సభ్యులతో మాట్లాడారు. మహిళలు సబ్సిడీ లోన్స్‌ తీసుకొని ఏమి పనులు చేస్తున్నారని అడుగగా కుట్టు మిషన్లు, కోళ్ల ఫామ్స్‌, క్యాంటీన్‌ పెట్టుకొని నడుపుతున్నామని కలెక్టర్‌ కు తెలిపారు. ఐకేపీ ద్వారా ప్యాడి ప్రో క్యూర్‌ మెంట్‌ జరుగుతుందా, వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం దోమ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. వంట గది, మూత్రశాలలు, రన్నింగ్‌ వాటర్‌ అన్నింటిని పరిశీలించారు. మిషన్‌ భగీరథ వాటర్‌ సప్లై ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలికలు అందరితో కలిసి సహాపంక్తి భోజనం కలెక్టర్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక దేవి, దోమ ఎంపీడీఓ మహేష్‌ బాబు, తహసీల్దార్‌ పురుషోత్తం, ఈఈ బాబు, శ్రీనివాస్‌, ఎంఈఓ హరి చందర్‌, ఎస్‌ఓ పద్మజ, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డాక్టర్‌ రజిత, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.