నవతెలంగాణ ఆర్మూర్
విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. బుధవారం పట్టణ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతి గదులను సందర్శించారు. అధ్యాపకుల బోధన, విద్యార్థులతో మాట్లాడారు. ప్రిన్సిపల్ నుస్రత్ జహాన్, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని, ప్రతి రోజు విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ, దృష్టిని కొనసాగించాలని అన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్న పేద, బడుగు, బలహీన, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్ కు బాటలు వేసే విధంగా విద్య బోధన చేయాలని అన్నారు.
కళాశాల పరిసరాలను తనిఖీ చేసి ఆవరణ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను పెంచి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డ్రగ్స్ పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
2024 – 25 విద్యా సంవత్సరం రానున్న వార్షిక పరీక్షలకు అధ్యాపకులు 90 రోజుల ప్రణాళిక ప్రకారం బోధన చేసి, ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలను సాధించాలని ఆదేశించారు.
రాబోయే ఇంటర్ ప్రయోగ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంతో పాటు వెనుకబడిన బడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు తో పాటు, వారు కూడా ఉత్తీర్ణులు అయ్యేందుకు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ నుష్రత్ జహాన్ పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.