కలిసికట్టుగా పనిచేయండి

together work– ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థి,ముఖ్యనేతలతో ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై నేతలతో చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చొరవను ప్రజలకు వివరించాలన్నారు. వంద రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్‌ అమలు చేసిన గ్యారంటీలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని కోరారు.