– మాటలు, మూటల ద్రోహులు కాంగ్రెసోళ్లు :
– జనగామ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-జనగామ
బీఆర్‌ఎస్ జనగామ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం జనగామ పట్టణ కేంద్రంలో జనగామ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమక్షంలో జనగామ బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిను స్టేజీ పైన అభివాదం చేయించారు. ఆలింగనం చేసుకొని తమ పూర్తి మద్దతు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఉంటుందని గెలుపు కోసం తాను కృషి చేస్తానని ముత్తిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కట్టుబడి తన టిక్కెట్‌ను త్యాగం చేశారన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించే స్థితిలో లేదన్నారు. కాంగ్రెస్‌లో మాటలు, మూటలు, ద్రోహులు, మతం మంటలు లేపుడు తప్ప ప్రజాభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.
జనగామ నియోజకవర్గంలో టికెట్ ఆశించే వ్యక్తి తన కన్నతల్లిని చూసుకునే స్థితిలో లేరని, మరో వ్యక్తి ఏడాదిలో ఆరు నెలలకు ఒకసారి వచ్చి పోయేవారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు. 11 సార్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్పటికీ ఏమి చేయలేకపోయారని, మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరడం సిగ్గుచేటన్నారు. సీఎంకు అత్యంత సన్నిహితునిగా పేరొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ జనగామ రానున్నారని, ఈ సభకు లక్ష మందిని తరలించి విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జనగామ జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి అని తెలిపారు. అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లతో కలిసి చేర్యాల కొమురవెల్లి దేవస్థానం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా జనగామకు చేరుకున్నారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, జనగామ జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వరు, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పి.జమున, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. a