– సికింద్రాబాద్, వరంగల్ నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 14 పార్లమెంటు నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మన గురి తప్పకూడదని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీలను ఓడించేందుకు రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి పని చేయాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్, వరంగల్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆయా నియోజవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా సాధించలేదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఎన్నో పెండింగ్ సమస్యలున్నాయనీ, అయినా ఆయన పట్టించుకోలేదన్నారు. వరంగల్ నియోజకర్గం అభ్యర్థిని ఓడిస్తామంటూ బీఆర్‌ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
వరంగల్ నియోజకవర్గం సమావేశంలో మంత్రి కొండా సురేఖ,సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సమావేశంలో అభ్యర్థి దానం నాగేందర్, అసెంబ్లీల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అజహరుద్దీన్, విజయారెడ్డి, ఆదం సంతోష్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఫిరోజ్‌ఖాన్, రోహిన్‌రెడ్డి, నీలిమా తదితరులు పాల్గొన్నారు.