– నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా స్క్రూటీని చేయాలి
– గుర్తుల కేటాయింపులో మార్గదర్శకాలను విధిగా పాటించాలి
– జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
జిల్లాలో అరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలలో నామినేషన్‌ల ప్రక్రియలోనామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.ఆదివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో రిటర్నింగ్ అధికారులకు, సిబ్బందికి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితా తయారీ, పోస్టల్ బ్యాలెట్ గురించి తగు సూచనలు చేశారు.ఇప్పటివరకు అందిన నామినేషన్ పత్రాలను ఎన్నికల కమిషన్ నిబంధనల ననుసరించి జాగ్రత్తగా ఈ నెల 13 న స్క్రూటినీ చేయాలని ఆదేశించారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం పేర్కొన్న నిబంధనల మేరకు పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం పోటీలో నిలిచే తుదిజాబితాను పొరపాట్లు లేకుండా తయారుచేయాలని దిశానిర్దేశనం చేశారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయింపులో గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలు ప్రకారం కేటాయించాలన్నారు. అభ్యర్థుల తుది జాబితా ఆధారంగానే బ్యాలెట్ పత్రాలు ముద్రణ జరుగుతుందని చెప్పారు.అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు కషి చేయాలని సూచించారు.ఎన్నికల విధుల్లో ఉన్న పీఓ,ఏపీఓ, ఓపీఓలకు ఈ నెల 6, 7వ తేదీలలో జరుగనున్న రెండవ విడత శిక్షణలో ఫారం 12ను అందచేసి పూర్తిగా అన్ని వివరాలతో నింపిన వాటిని సేకరించాలన్నారు.మూడో విడత శిక్షణలో శిక్షణా కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నకిరేకల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్‌పాటిల్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్, రిటర్నింగ్ అధికారులు రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.