ఇరవై యేండ్లుగా చాకిరీ

Work for twenty years– అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల
– కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ దీన స్థితి
– నెలవారీ డెలివరీ కేసుల టార్గెట్ల పెంపు
– ఉద్యోగం పర్మినెంట్‌ కాదు.. జీతాలు పెరగవు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల కాంట్రాక్టు ఎంప్లాయీస్‌కు సామర్థ్యానికి మించి టార్గెట్లు, పని ఒత్తిడి పెంచుతూ ప్రభుత్వం వారితో చాకిరీ చేయిస్తోంది. ఉద్యోగం పర్మినెంట్‌ కాకపోతదా? జీతాలు పెరగకపోతయా అన్న ఆశతో ఉన్న వారి ఎదురుచూపులలో కొందరికి 20 ఏండ్ల సర్వీసు దాటింది. వచ్చే అరకొర వేతనాలకు తోడు ఇమ్యూనేషన్‌ బకాయిలు రాక, సరిపడా సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ లేక ఉన్నవారికి అదనపు పనులు అప్పగించడంతో వారంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. స్పోటం శాంపిల్స్‌ సేకరణ, వ్యాక్సిన్‌, మెడిసిన్‌ ట్రాన్స్‌పోర్టు పనులు అప్పగిస్తూనే కాంట్రాక్టు ఏఎన్‌ఎమ్‌లకు నెలవారీ డెలివరీ కేసుల టార్గెట్లు ఇస్తున్నారు. అందులోనూ గర్భం దాల్చిన మహిళ వివరాలు రెన్నెళ్లలోపే నమోదు చేయాలనే నిబంధన వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇచ్చిన టార్గెట్లు పూర్తికాక, పైఅధికారులు ఇచ్చే మెమోల తో సతమతం అవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 249 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉండగా కాంట్రాక్టు పద్ధతిలో 841 మంది ఏఎన్‌ఎమ్‌లు పని చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఆయా సెంటర్లలో కలిపి 12 మంది స్టాఫ్‌ నర్సులు, 30 మంది ఏఎన్‌ఎమ్‌లు, ఆరుగురు చొప్పున ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, అకౌంటెంట్లు సహా స్వీపర్‌, అటెండర్లు ఆరుగురు పని చేస్తున్నారు. వీరితోపాటు కమ్యూనిటీ ఆర్గనైజర్లు ముగ్గురు ఉన్నారు. అయితే ఏఎన్‌ఎమ్‌ల నియామకం ప్రతి 3వేల మందికి ఒకరు చొప్పున ఉండాలనే నిబంధన ఉంది. అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం 12వేల మందికి ఒకరు చొప్పున మాత్రమే ఏఎన్‌ఎమ్‌ పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం గర్భిణుల నమోదు మొదలు.. సర్కారు దవాఖానాల్లో డెలివరీలు జరిగేలా చేయాలనే నిబంధన ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న గర్భిణుల్లో చాలా మంది డెలివరీ కోసం ప్రయివేటు ఆస్పత్రులవైపే మొగ్గు చూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఏఎన్‌ఎమ్‌లకు ఇచ్చిన టార్గెట్లు పూర్తికావడం లేదు. ఇలా ఒక్కో ఏఎన్‌ఎమ్‌కు కనీసం 10 చొప్పున అయినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయ్యేలా చూడాలని లక్ష్యాలను నిర్ధేశించడం, అది చేరుకోని వారికి మెమోలు జారీ చేయడం వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. అయితే ఈనెల 29న వారికి డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష నిర్వహించబోతున్నారు. సుమారు 70 ప్రశ్నలకు సమాధానాలను కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో రాయాల్సి ఉంది. కేవలం గంట మాత్రమే సమయం ఇచ్చి పరీక్ష నిర్వహిస్తుండటంతో రాసే వాళ్లలో చాలా మంది సుమారు 40ఏండ్ల పైబడి ఉన్నవారే ఎక్కువమంది ఉన్నారు. మిగిలిన ఏఎన్‌ఎమ్‌లలో 30 నుంచి 40ఏండ్ల మధ్యవయస్కులు ఉన్నారు. వీరిలో చాలా మందికి కంప్యూటర్‌ పరిజ్ఞానం లేదు. దీంతో పరీక్ష రాసేందుకు, ఇచ్చిన గడువులో ప్రశ్నలు చదివి సమాధానం రాసేందుకు జంకుతున్నారు.
దశాబ్దాలుగా ఎదురుచూపులు
20ఏండ్లుగా ఉద్యోగం రెగ్యులర్‌ అవుతుందని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వాలు మారినా మా డిమాండ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. రెగ్యులర్‌ సిబ్బంది చేసే పని కంటే అదనంగానే విధులు నిర్వహిస్తున్న మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎగ్జామ్‌ రాసిన వారిలో పర్మినెంట్‌ కాని వాళ్లకూ గ్రాస్‌ శాలరీ లేదంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
– బీ. సంపూర్ణ, అర్బన్‌హెల్త్‌సెంటర్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు
సమాన పనికి సమాన వేతనాలివ్వాలి
రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌ మాదిరిగానే తామూ అదే హోదాలో పని చేస్తున్నప్పటికీ జీతాలు అరకొరగానే వస్తున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగులకిచ్చే జీతాలు మాకూ ఇవ్వాలి. ఖాళీలను భర్తీ చేయాలి. అదనపు సిబ్బందిని నియమించి అర్భన్‌హెల్త్‌సెంటర్లలో పనిఒత్తిడిని తగ్గించాలి.
సీహెచ్‌.స్వరూపరాణి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి