– సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని జులై 10న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం కేసముద్రం మండలంలోని హరిహర గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు అధ్యక్షతన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని గత పది సంవత్సరాలుగా సాగించిన ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేయడానికి ఉవ్విళ్లూరుతోందని ఆయన తెలిపారు. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను లీజుకివ్వడం, అమ్మేయడం వంటి చర్యలను వేగవంతం చేయడంలో భాగంగానే శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ని వేలం వేస్తున్నదని విమర్శించారు. దుర్మార్గంగా కార్మికులను బలి కోరే లేబర్ కోడ్ ల అమలుకు పూనుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలనే అవలంభిస్తుందని వివరించారు. ఆశాలకు పరీక్షలు నిర్వహించటం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో మాట తప్పి అంగన్‌వాడీలను ఏకపక్షంగా ఉద్యోగంలో నుండి తీసేయడం వంట చర్యలు చేపట్టిందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలకు అందక అవస్థలు పడుతున్న చోద్యం చూస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జులై 10న జరిగే కార్మికుల డిమాండ్స్ డేలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు మండల కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్, సమ్మేట రాజమౌళి, దుండి వీరన్న, చింతా మౌనిక, జల్లే జయరాజు, దాసరి మల్లేశం, వల్లాల వెంకన్న, ఈసంపల్లి సైదులు, జమ్ముల శ్రీను, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.