కార్పొరేట్లకు కార్మికుల ప్రయోజనాలు తాకట్టు

Workers' interests are collateral to corporates– మా పోరాటం కార్పొరేట్‌, మతోన్మాదుల మీదే : సీఐటీయూ ఆలిండియా ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌
– బీజేపీని ఓడించకపోతే హక్కులుండవు : బీవీ రాఘవులు
– హన్మకొండలో కార్మికుల మహా ర్యాలీ, బహిరంగసభ
– నేటి నుంచి 3 వరకు జాతీయ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కార్పొరేట్లకు కార్మిక, కర్షకుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న బీజేపీని రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆలిండియా ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఫాతిమానగర్‌ బాలవికాసలో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు జరగనున్న సీఐటీయూ జాతీయ వర్కింగ్‌ కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం కార్మికుల మహార్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. హన్మకొండలోని వేయిస్థంబాల గుడి వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ హన్మకొండ చౌరస్తా మీదుగా అశోక్‌ థియేటర్‌ నుంచి పబ్లిక్‌ గార్డెన్‌కు చేరింది. ఈ ర్యాలీని సీఐటీయూ ఆలిండియా కోశాధికారి ఎం. సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రారంభించారు. డప్పు చప్పుళ్ల నడుమ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ మహా ప్రదర్శన అనంతరం డాక్టర్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ ఆడిటోరియంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టి.ఉప్పలయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది.
తొమ్మిదిన్నరేండ్లుగా మోడీ విద్వేష, మత రాజకీయాలు : తపన్‌సేన్‌
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదిన్నరేండ్లుగా విద్వేష, మత రాజకీయాలు చేస్తున్నారని తపన్‌సేన్‌ అన్నారు. దేశ ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌, బడా వ్యాపారులకు మేలు చేసే విధానాలను అమలు చేస్తూ వారికి మాత్రమే లాభాలు వచ్చేలా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్మిక కోడ్‌లను తీసుకువచ్చి యాజమాన్యాలకు కేంద్రం వత్తాసు పలికి కార్మిక హక్కులను అణిచివేసిందన్నారు. మన పోరాటం కార్పొరేట్‌, మతోన్మాద శక్తుల మీదనేనన్నారు. అన్ని రంగాలను ప్రయివేటీకరిస్తున్న మోడీ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని విమర్శించారు. మనల్ని రక్షించుకోవడం ద్వారా మనం దేశాన్ని రక్షించాలన్నారు. ఈ తొమ్మిదిన్నరేండ్లలోనే అభివృద్ధి జరిగిందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారన్నారు. గతేడాది నవంబర్‌ 26, 27, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా నిర్వహించిన ‘మహా పడావ్‌’లో 7 లక్షల మంది కార్మికులు పాల్గొని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికుల సమ్మె కూడా విజయవంతమైందని తెలిపారు. మతాన్ని రాజకీయాలతో మిళితం చేసి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభించి.. తనవల్లే రామాలయ నిర్మాణం సాధ్యమైందని ప్రచారం చేసుకుంటూ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నెల రోజులుగా ఇటువంటి ప్రచారంలోనే కేంద్ర ప్రభుత్వం నిమగమై ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ తన మత ఎజెండాతో ముందుకు వెళ్తున్నా, మనం మన ఎజెండాతో ముందుకు సాగుతూనే వున్నామన్నారు. ఇందులో భాగంగానే జనవరి 26న అన్ని రాష్ట్రాల్లో రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ట్రాక్టర్‌, ద్విచక్ర వాహన ర్యాలీలను విజయవంతంగా నిర్వహించామన్నారు. అలాగే, బీజేపీని గద్దె దింపేందుకు ఈనెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.
కార్మిక సంఘాలతో సీఎం రేవంత్‌ సమావేశం కావాలి
రాష్ట్రంలో వెంటనే కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్‌ను రాఘవులు డిమాండ్‌ చేశారు. నెలకో, రెండు నెలలకు ఒకసారి కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, చర్చల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్మికుల వర్గ పోరాటాలను అణిచివేసినందుకే రెండు నెలల క్రితం బీఆర్‌ఎస్‌ను ఓడించి సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపారన్నారు. 4.50 కోట్ల తెలంగాణ ప్రజల్లో 1.50 కోట్ల మంది కార్మికులున్న విషయాన్ని నాటి సీఎం కేసీఆర్‌, నాటి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు గుర్తించలేదన్నారు. ఈ సభలో సీఐటీయూ ఆలిండియా కార్యదర్శి ఏఆర్‌. సింధు, రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు తదితరులు మాట్లాడారు. పాల్గొన్న వారిలో.. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్‌, రాగుల రమేష్‌, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు గాదె ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌. రజిత, బొట్ల చక్రపాణి, ఎం. చుక్కయ్య, సారంపల్లి వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.
బీజేపీని ఓడించకపోతే హక్కులుండవు : బీవీ రాఘవులు
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే దేశంలో హక్కులుండవని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఐటీయూ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు హెచ్చరించారు. బీజేపీని ఓడించడమే కర్తవ్యం కావాలన్నారు. దేశంలో మోడీ ప్రధాని అయ్యాక రాజ్యాంగానికి, హక్కులకు ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ప్రశ్నించే కవులు, మేధావులు, ఉద్యమకారులను మోడీ జైల్లో పెట్టించారన్నారు. ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావుల ఆరోగ్యం బాగా లేకపోయినా జైళ్లల్లో వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో సనాతన ధర్మాన్ని అమలు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, సనాతన ధర్మమంటే ఆడవాళ్లు ఆశాలుగా, అంగన్‌వాడీలుగా పనిచేయలేరని, ఇంట్లో వంట చేయడం, పిల్లల్ని కనడం వరకే పరిమితం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని రూపుమాపాలని ప్రకటించారని, దీనిపై బీజేపీ నేతలు పెద్ద పెట్టున దుష్ప్రచారం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ.. గత పార్లమెంటు ఎన్నికల్లో 17 శాతం ఓట్లు, 4 పార్లమెంటు సీట్లు గెలిచిందని, ఈసారి ఆ ఓట్లు, సీట్లు కూడా రాకుండా చూడాలని పిలుపునిచ్చారు.