– సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
– కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల ఆందోళన
– కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, గ్రామపంచాయతీ కార్మికుల మూడు నెలల వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ కరోనా సందర్భంగా గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికుల ఈఎస్‌ఐ డబ్బులు కోటీ36లక్షలు ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు రూ.50వేల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలన్నారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్నంటడంతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ నాయకులు గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు సమ్మె శిబిరాలకు వచ్చి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, లింగాల చిన్నన్న, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దర్శనాల నగేష్, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు, సోనేరావ్, వెంకట్రావ్, రమక్క, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు ఎం.జనార్దన్, బొజ్జ ఊశన్న, మల్లక్క, శ్యామ్, ఆత్మరాం, భాస్కర్, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు శంకర్, కిరణ్, ఇంద్రజ్ అశోక్, శివ, గంగన్న, ప్రకాష్, విలాస్ పాల్గొన్నారు.