
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
వచ్చే నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి, కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ, వజ్జ సుశీల పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ఆదివారం గుండాల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మండల కో కన్వీనర్ పాయం సారమ్మ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అబ్దుల్ నబీ, సుశీల మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసి అదాని, అంబానీల వంటి వారికి ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని వివరించారు. రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తు కర్షకులకు నష్టం కలిగించే పనులు చేస్తూ వస్తుందన్నారు. దాంతో పాటు దేశ ప్రధాని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రామ జన్మభూమిలో బాల రాముడిని ప్రతిష్టించి మత రాజకీయాలకు తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజల పట్ల పారదర్శకత, లౌకిక వాదం మరిచి ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒకే మతానికి తన ప్రాధాన్యత, ప్రాచుర్యం కల్పించడం రాజ్యాంగ నిబంధనలను పాటించకుండా తుంగలో తొక్కడమేనని ఘాటుగా విమర్శించారు. వచ్చే నెల 16న జరిగే దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయడానికి కార్మికులు, వివిధ రంగాల వారు జాగృతమై మండలంలో గ్రామ పంచాయితీ యూనిట్ గా జనరల్ బాడీ సమావేశాలు జరిగే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తలు పూలమ్మ, సారమ్మ, కౌసల్య, కళావతి, ఆశా వర్కర్లు ఆదిలక్ష్మీ, సరోజ, లక్ష్మీ, హాస్టల్ డైలీవేజర్లు కొటెం బాలన్న, వీఓఏ కాంతారావు, బొమ్మయ్య, మధ్యాహ్న భోజన కార్మికులు నర్సమ్మ, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.