– ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో కేకే
– కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బి ఆర్ ఎస్ నాయకులు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరికైనా సుమారు 600 మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా తన వెంట ఉండి ప్రోత్సహించిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలను అమలుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనాని అన్నారు. గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంతో అసహనానికి గురయ్యారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు ఓ సైనికుడు లాగా కృషి చేయాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో ఎన్నో అక్రమాలు,డిల్లీ లిక్కర్ స్కాములు, భూకబ్జాలు, దోపిడీలు, గ్రూప్ పరీక్షలు లీకేజీలు, ఇక్కడి ప్రాంత సహజ వనరుల దోపిడీకి గురి చేశారని గుర్తు చేశారు. రైతులకు ఈ ప్రాంత రైతులు కరువు కాటకాలతో బాధపడుతున్నారంటే దానికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదన్నారు.గత ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని తెలిపారు. వడగండ్ల వానకు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల కు, ఇతర రైతుకు రూ . 10వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.