– ఉద్యోగుల సమస్యలు పట్టవా..?
– 73 ఎంప్లాయీమెంట్ షెడ్యూల్ వేతన సవరణేది?
– 4 లేబర్ కోడ్ల రద్దుకు ప్రస్తావనేదీ?
– శ్రమ దోపిడీకి గురవుతున్న స్కీమ్ వర్కర్లు
– కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థ రద్దు కాలే..
– ఎవరికీ పట్టని అసంఘటిత రంగం వేతనాలకు నోచని ప్రభుత్వ ఉద్యోగులు
– పోరాట ఆయుధమైన ‘ఓటు’
కోట్లాది మంది కార్మికులు, లక్షలాది మంది ఉద్యోగుల సమస్యలేవీ పాలక పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలో కనిపించడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భ్రమలకు గురి చేసే హామీలు తప్ప మౌలిక మార్పులు తెచ్చే విధానపరమైన అంశాలకు మ్యానిఫెస్టోలో చోటివ్వలేదు. ఎన్నికల వేళ అన్ని వర్గాల, తరగతుల ప్రజల్ని ఆకర్షించేందుకు పాలక పార్టీలు అలవిగాని హామీలిస్తున్నాయి.
కార్మికుల హక్కుల్ని హరిస్తూ కేంద్రం తెచ్చిన ప్రమాదకర నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేస్తామని ప్రధాన పార్టీలు చెప్పట్లేదు. రాష్ట్రంలో కోటి మంది కార్మికులకు మేలు జరిగే 73 షెడ్యూల్ ఎంప్లాయీమెంట్స్‌లో కనీస వేతనాల సవరణ గురించి ప్రస్తావనా లేదు. శ్రమదోపిడీకి గురవుతున్న స్కీమ్ వర్కర్ల గురించి లేదు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టలేదు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించలేదు. అందుకే ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికులు, ఉద్యోగుల ప్రధాన సమస్యల్ని చేర్చి వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఎఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ ఇతర కార్మిక సంఘాలు కోరుతున్నాయి. త్పాదకతను పెంచడంలో వివిధ రంగాల్లో సేవలందించడంలో.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలో కృషి సాగిస్తున్న కార్మికులు, ఉద్యోగుల్ని పాలక పార్టీలు విస్మరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం, అంగన్వాడీలు, ఆశాలు, ఐకేపీ విఓఏలు, పారిశ్రామిక, గ్రామ పంచాయతీ, మున్సిపల్, హమాలీ కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పర్మినెంట్, వేతనాల పెంపు కోసం పోరాడారు. ప్రభుత్వం ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదు. అందుకే ఓటును కార్మికులు, ఉద్యోగులు పోరాట ఆయుధంగా మల్చుకునేందుకు సిద్ధమయ్యారు. తమ సమస్యల్ని మ్యానిఫెస్టోల్లో పెట్టి వాటిని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌టేబుల్ సమావేశాలు, చర్చాగోష్టిలు నిర్వహిస్తున్నారు.
73 షెడ్యూల్ ఎంప్లాయీమెంట్స్‌లో కనీస వేతన సమరణ
రాష్ట్రంలో కోటి మందికి ప్రయోజనం కల్గించే 73 షెడ్యూల్డ్ ఎంప్లాయీ మెంట్స్‌లో కనీస వేతనాల్ని సవ రించాలని కార్మికులు పోరాడు తున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లకు కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించా లని డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి జీవో 21,22,23,24,25 గెజిట్ చేయాలని కోరుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీస వేతనాల జీవోల సవరణలో జాప్యం చేస్తున్నందున జీవో గడువు ముగిసిన రోజు నుంచే ఏరియల్స్ సహా చెల్లించాలని కోరుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని, పారిశ్రామిక ప్రాంతమైన సంగారెడ్డిలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, పెరిగిన సాంకేతికత దృష్టా రోజుకు 7 గంటలు, వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయా లని కోరుతున్నారు.
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కేంద్రం తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, ఈ విషయాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాలని కార్మికులు కోరు తున్నారు. రాష్ట్రంలో లేబర్ కోడ్‌లను అమలు చేయబోమని ప్రభు త్వం ఏర్పడగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్, రైల్వే వంటి సంస్థల ప్రయివేటీకరణను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ తీర్మానం చేయాలనే డిమాండ్ ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో లేబర్ అధికారుల్ని నియమించాలని, మూతపడిన పరిశ్రమల్ని పునరుద్దరించాలని, సేల్స్ ప్రయోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ తేవాలని, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌కు స్టాట్యూటరీ వర్కింగ్ రూల్స్ రూపొందించాలని కోరుతున్నారు.
స్కీమ్ వర్కర్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న స్కీమ్ వర్కర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కనీసం కార్మికులుగా గుర్తించడం లేదు. కనీస వేతనాలుండవు. పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్, గ్రాట్యుటీ సదుపాయాలేవీ లేవు. సామాజిక భద్రత కరువైన స్కీమ్ వర్కర్ల సంక్షేమం గురించి మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరుతున్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, ఉపాధి హామీ ఉద్యోగులు, ఐకేపీ విఓఏలు, మిషన్ భగీరథ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు.
అసంఘటిత రంగంలో అరిగోస
అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర శాసనం చేయాలి. పెన్షన్ రూ.7 వేలకు తగ్గకుండా ఇవ్వాలి. భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మాదిరి మోటర్ సైకిళ్లు, స్కూటీలివ్వాలి. వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి. దారిమళ్లిన రూ.1255 కోట్లను తిరిగి బోర్డులో జమ చేయాలి. బీడీ కార్మికులకు నెలలో 26 రోజుల పని కల్పించి జీఎస్టీ నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలి. హమాలీలు, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు కార్మికులు, మిల్లు ఆపరేటర్లు, దడవాయిలు, చాట, సడెం కార్మికులందరికీ వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఊబర్, పోర్టర్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఆన్‌లైన్ యాప్‌ను ఏర్పాటు చేయాలి. పవర్‌లూమ్, సెక్యూరిటీ గార్డ్స్‌కు బీమా, ఇతర సదుపాయాలు కల్పించాలి.
ఒకటో తేదీనే వేతనాలివ్వాలి
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఫైనల్ చేసి జాప్యం లేకుండా అమలు చేయాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)ను పకడ్బందిగా అమలు చేయాలి. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలివ్వాలి. ఎన్‌హెచ్‌ఎం, 104, 108, ఆరోగ్య శ్రీ, టీసాక్స్, ఆయుష్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఎంప్లాయీస్‌కిచ్చే మినిమం బేసిక్, డీఎ, హెచ్‌ఆర్‌ఎ ఇవ్వాలి. వైద్య ఆరోగ్య శాఖలో రేషనలైజేషన్ జీవో 142ను రద్దు చేయాలి.
స్థానిక సంస్థల కార్మికులు
పరిసరాల పరిశుభ్రతలో అవార్డులు తెస్తున్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికుల్ని పాలకులు పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్మికుల్ని పర్మినెంట్ చేయడంతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీ ద్వారా వేతనాలివ్వాలి. రెండో పీఆర్సీ పరిధిలోకి జీపీ కార్మికుల్ని తీసుకురావాలి. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా గుర్తించాలి. జీవో 51ని సవరించాలి. ఫల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. మున్సిపల్ కాంట్రాక్టు, ఆవుట్‌సోర్సింగ్ కార్మికులకు కేటగిరిల వారీగా కనీస వేతనాలివ్వాలి. జీహెచ్‌ఎంసీ కార్మికులందరికీ బస్‌పాస్ ఇవ్వాలి. కాంట్రాక్టు, ఆవుట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలి. పారిశుధ్య సేవల్లో ప్రయివేటీకరణకు స్వస్తి పలకాలి.