ఐక్యపోరుబాటలో కార్మికవర్గం

రాష్ట్రంలో కార్మికవర్గం పోరుబాటలో ఉన్నది. సమస్యల పరిష్కారం కోసం ఐక్యపోరాట బాట పట్టింది. పాలకుల మొండివైఖరినీ, ఏకపక్ష ధోరణులనూ ఎదిరించి పోరాడుతున్నది. సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో ఉద్యమబాటలో నడుస్తున్నది. పోరాటాల పట్ల అసహనం ప్రదర్శించే పాలకులు కూడా సమస్యలు పరిష్కరించాలని గుర్తించకతప్పటం లేదు. ఇది కార్మికవర్గ ఐక్య పోరాట శక్తి ఫలితం. స్కీం వర్కర్లు, మున్సిపల్‌, గ్రామపంచాయతీ, పారిశ్రామిక కార్మికులన్న తేడా లేదు. అనేక రంగాల కార్మికులు కదులుతున్నారు. 483 గ్రామీణ మండలాల్లో 43,415 మంది కార్మికులు జులై 6 నుంచి సమ్మెలో ఉన్నారు. పాఠశాల స్వీపర్లు కూడా సమ్మెలో ఉన్నారు. ఈమధ్యనే మూడు రోజుల చారిత్రాత్మక సమ్మె చేసిన అంగన్‌వాడీలు ఇప్పుడు దేశవ్యాపిత నిరసనలో సమరశీలంగా పాల్గొన్నారు. నల్లచీరలను చూసి ఆగ్రహించిన అధికారులకు తగు సమాధానం చెప్పారు. కనీసవేతనాలు, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లింపు, పెండింగ్‌ సమస్యల పరిష్కారంతో పాటు కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది అంగన్‌వాడీలు కదం తొక్కారు. జులై 10వ తేదీన 30వేల మంది ధర్నాలలో పాల్గొన్నారు. పది కిలోమీటర్లు పాదయాత్రలు చేసారు. గత సంవత్సరం మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ప్రకారం మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.2000 వేతనం పెంపు కోసం పోరుబాట పట్టారు. పెంపుదల అమలు, ఏరియర్స్‌, కొత్త మెనూ కోసం అదనపు బడ్జెట్‌ కోసం 13,200 మంది మూడు రోజులు సమ్మె చేసారు. మండల కేంద్రాలలోను, కలెక్టర్‌ కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నాలు చేసారు. సమ్మె జరుగుతుండగానే అధికారులు కొన్ని జిల్లాలలో పెండింగ్‌ బిల్లులు చెల్లించారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బహిరంగ ప్రకటన చేయవల్సి వచ్చింది. పెరిగిన వేతనం అమలుకు, వారం రోజులలో బడ్జెట్‌ విడుదలకు అంగీకరించారు.
ఆశాలకు పరీక్షలు నిర్వహించాలనీ, ఉత్తీర్ణులైనవారినే కొనసాగించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. దీన్ని ఆశాలు తీవ్రంగా ప్రతిఘటించారు. పరీక్షల పద్ధతి రద్దుతో పాటు అనేక ఇతర సమస్యల పరిష్కారం కోసం 650 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర 8,570మంది ధర్నాలలో పాల్గొన్నారు. పోరాటం జరుగుతుండగానే టెలి కాన్ఫరెన్స్‌లో ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ప్రకటించారు. పరీక్షల పద్ధతి రద్దు చేస్తూ, కోర్కెల పత్రంలోని ఫిక్స్‌డ్‌ వేతనం తప్ప మిగిలిన అన్ని కోర్కెలూ అంగీకరించారు. ప్రసూతి సెలవులు, ఆస్పత్రులలో విశ్రాంతి గదుల ఏర్పాటు, రిజిస్టర్లు ఇవ్వటానికి, నాణ్యమైన దుస్తులు (యూనిఫామ్‌), జాబ్‌ చార్ట్‌ రూపొందించటానికీ అంగీకరించారు. గతంలో సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం అమలుచేయాలనీ, గుర్తింపు ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులకు ఓటు హక్కు ఇవ్వాలనీ కోరుతూ సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం దగ్గర ధర్నా చేసారు. పరిష్కారానికి కమిషనర్‌ అంగీకరించారు. పాలిటెక్నిక్‌, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పోరాడారు. అక్రమంగా తొలగించిన 206 మందిని పనిలోకి తీసుకోవాలని ధర్నాలు చేసి పాక్షిక విజయం సాధించారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా వేతన పెంపుదల కోసం పోరాడి పాక్షిక విజయం సాధించారు. 19జిల్లాలలో, 64 కేంద్రాలలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని పట్టాల కోసం, ఇండ్ల నిర్మాణం కోసం పోరాడుతున్న పేదల గుడిసెలు నిలదొక్కుకుంటున్నాయి. అధికారుల ఒత్తిడులు, కొన్నిచోట్ల పోలీసుదాడులను తట్టుకుని నిలబడుతున్నారు.
ఈ పోరాటాలకు ముందు 20,700 విలేజి రెవెన్యూ అసిస్టెంట్లు జేఏసీ ఆధ్వర్యంలో 80రోజుల సుదీర్ఘ సమ్మె చేసారు. 9750 గ్రామపంచాయతీల కార్యదర్శులు, తమ సమస్యల పరిష్కారం కోసం 30రోజుల సమ్మె చేసారు. ఐకేపీ, వీఓఏలు 18వేలమంది 44 రోజులు సమ్మె చేసారు. 16వేల మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులు 18రోజులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేసారు. ఈ సమ్మెలు అన్నింటిలోనూ సీఐటీయూ నాయకత్వం జోక్యంతో సమస్యలు కొలిక్కి వచ్చాయి. సమస్యల తీవ్రత సుదీర్ఘ నిరవధిక సమ్మెలకూ, ఐక్య పోరాటాలకూ దారితీసింది. ప్రభుత్వ మొండివైఖరి, ఏకపక్ష ధోరణి సమస్య పరిష్కారానికి ఆటంకమైంది. అధికారులు వినతిపత్రాలు కూడా తీసుకోడానికి తిరస్కరించే ధోరణి ప్రదర్శించారు. సమ్మెల పట్ల పాలకులు తీవ్ర అసహనం ప్రదర్శించారు. కార్మికుల సమిష్టి బేరసారాల హక్కును నిరాకరించారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నుండి తప్పించు కోలేక పోయారు. అంతిమంగా, పోరాడిన కార్మికులు విజయం సాధించారు. విద్యుత్తు రంగంలో మాత్రం ఐక్యపోరాటానికి కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రధాన సంఘాల నాయకుల లొంగుబాటు వైఖరి ఫలితంగా నష్టపోయారు. పోరాడే సంఘాలు ఆ రంగంలో బలహీనంగా ఉండటమే యాజమాన్యానికి కలిసివచ్చింది.
గత రెండు సంవత్సరాలుగా, కనీస వేతనాలు సవరించాలని రాష్ట్రవ్యాపితంగా కార్మికులు అనేక పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. జూన్‌ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో సీఐటీయూ నాయకులు జీపుయాత్ర చేసి కార్మికులను ప్రత్యక్షంగా కలిసారు. జులై 14న కలెక్టర్‌ కార్యాలయాలకు తరలివచ్చిన కార్మికుల సంఖ్య సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తున్నది. రాష్ట్రంలో కోటిమంది కార్మికులకు సంబంధించిన సమస్య కనీసవేతనాలు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ముఖ్యంగా వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉన్నది. సగానికి పైగా కార్మికులు వీరే. కాంట్రాక్టీకరణ సర్వసాధారణమైంది. పన్నెండు గంటల డ్యూటీ చేయిస్తున్నారు. కార్మిక చట్టాలేవీ అమలులో లేవు. వలస కార్మికులను అనేకచోట్ల కంపెనీ ఆవరణలోనే షెడ్లలో పెట్టి, బానిస చాకిరీ చేయిస్తున్నారు. హమాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్టు వంటి అసంఘటిత రంగాలలో కూడా వలస కార్మికుల సంఖ్య బాగా పెరిగింది. వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయటం లేదు.
ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం గత 15మాసాలుగా పేదలు పోరాడుతున్నారు. లక్షకు పైగా కుటుంబాలు గుడిసెలు వేసుకుని హక్కుల కోసం పోరాడుతున్నారు. జూన్‌ మాసంలో కొన్ని మునిసిపల్‌ వార్డులు, గ్రామాలలో సర్వే చేస్తే లక్షమంది ఇండ్లు లేని పేదలు వెంటనే తహసీల్దార్లకు దరఖాస్తు చేసారు. ఇది సమస్య తీవ్రతను సూచిస్తున్నది. జులై 3న కలెక్టర్‌ కార్యాలయాలకు తరలివచ్చిన పేదల ఆందోళన కూడా సమస్య తీవ్రతను సూచిస్తున్నది. గృహలకిë పేరుతో సమస్యను దాటవేసే పాలకుల ధోరణి సరైంది కాదు. ఇండ్ల పట్టాల కోసం జరుగుతున్న పోరాటాలలో మహిళలే వేలాదిగా తరలిరావటం ప్రత్యేకత. రాత్రీ, పగలు భూమిని అంటిపెట్టుకుని నిలబడుతున్నారు. మహిళలకు మరుగు, భద్రత ప్రాధాన్యతను సూచిస్తున్న అంశమిది. బట్టలు మార్చుకోవాలన్నా, ఆడపిల్లలను పెంచాలన్నా తడికచాటు అవసరం కదా! మరుగుదొడ్లు, స్నానాల గదులు అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇది మహిళల ఆత్మగౌరవ సమస్య. కొన్ని కేంద్రాలలో పోలీసుల దాడులు, చిత్రహింసలు కూడా భరిస్తూ మహిళలు నిలబడుతున్నారు. ఒక పోరాటకేంద్రంలో, ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాలలో, ఇండ్ల స్థలాల పేరుతో ఉండటం ఖురాన్‌ అంగీకరించదని రెచ్చగొట్టే ప్రయత్నాలకు కూడా ముస్లిం మహిళలే సమాధానం చెప్పారు. అందువల్ల ఈ సమస్య ప్రత్యేకతను గమనించాలి.
పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలే పరమావధిగా భావించే పాలకులు, పోరాటాల పట్ల అసహనం ప్రదర్శించటంలో ఆశ్చర్యం లేదు. మంత్రులైనా, పాలకపక్షానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులైనా ఈ వైఖరి ప్రదర్శించటంలో వింత ఏమున్నది? ఒక మంత్రి, పోరాటంలో ఉన్న కార్మికుల పట్ల నోరుపారేసుకున్నారు. క్షుద్ర రాజకీయాలు నడిపేవారి చేతుల్లో పడిన కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఒక శాసనసభ్యుడు ”ఆటంకాలు సృష్టించటమే సీఐటీయూ పని” అని నిందించారు. కొందరు కలెక్టర్లు సీఐటీయూ నాయకులే కార్మికులను రెచ్చగొడుతున్నారని విసుక్కున్నారు. కార్మికులు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి పోరాడరనీ, కడుపు కాలినప్పుడు అనివార్యంగా పోరుబాట పడతారనీ ఎంత తొందరగా గుర్తిస్తే అంతమంచిది. కార్మికుల ప్రయోజనాలకే అంకితమైన కార్మికసంఘాలు సహజంగానే వారికి అండగా ఉంటాయి. అది వాటి బాధ్యత. అభాండాలు వేసిన మంత్రులూ, అధికారులే అనేక సందర్భాలలో, చర్చలతో సమస్యల పరిష్కారానికి పూనుకోవల్సి వచ్చింది. సమిష్టి బేరసారాల హక్కును గౌరవించి, చర్చలు జరపాలన్న స్పృహలో ఉండాలి. వివేకం ప్రదర్శించాలి. భావోద్వేగాలతో చెలగాటమాడే శక్తులు, ఓట్లకోసం మతాన్ని వాడుకునే నేతలు కార్మికుల అసంతృప్తిని వాడుకుంటారనీ, పక్కదారులు పట్టిస్తారన్న ప్రమాదాన్ని గుర్తించాలి. న్యాయమైన సమస్యల పరిష్కారం విషయంలో భేషజాలకు పోవడం తగదు.
ఎస్‌. వీరయ్య