– క్రాప్ లోను పరిమితిని 3 లక్షలకు పెంచుతాం
– ఎలాంటి సమస్య నైనా సమిష్టిగా పరిష్కరించుకుంటాం
– డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ డీసీసీబీ బ్యాంకును సభ్యుల సమిష్టి కృషితో రాజకీయాలకు అతీతంగా మూడువేల కోట్ల టర్నోవర్తో ముందుకు తీసుకు వెళ్తామని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో జిల్లా సహకార కేంద్ర 103 మహాజన సభను నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొదటిసారిగా నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.గత చైర్మన్ ఆధ్వర్యంలో కూడా సమిష్టి కృషితో 23 వందల కోట్ల టర్నవర్తో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంచామని ఎన్ పి ఏ విషయంలో 1:8 శాతానికి తగ్గించామని గుర్తు చేశారు. క్రాప్ లోను మూడు లక్షల వరకు పరిమితి పెంచుతామని అన్నారు. ఎల్టీ లోన్ల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని టెక్నికల్ విషయంలో ఉన్న సమస్యను పరిష్కరిస్తామన్నారు. చైర్మన్ ల ప్రోటోకాల్ విషయంలో మంత్రుల సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పంతాలు పట్టింపులు వద్దని సమస్యల పరిష్కారమే ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. సభ్యుల సలహాలు సూచనలు పాటిస్తామని ఎలాంటి సమస్యలైనా సమిష్టిగా పరిష్కరించుకుందామని తెలిపారు. రైతు క్షేమమే ప్రతి ఒక్కరి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకట్ రెడ్డి , డిసిసిబి వైస్ చైర్మన్ ఎస్ రెడ్డి దయాకర్ రెడ్డి, జిల్లా కో-ఆపరేటివ్ శాఖ అధికారి కిరణ్, డైరెక్టర్లు సంపత్ రెడ్డి కోడి పద్మ పల్లా ప్రవీణ్ రెడ్డి గుడిపాటి సైదులు, అంజయ్య, బ్యాంక్ సీఈవో శంకరరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన వివిధ మండలాల పిఎసిఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పిఎసిఎస్ చైర్మన్ లను డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సత్కరించారు.