కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న..

Working in contract and outsourcing..– రెండో ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌)లను రెగ్యులరైజ్‌ చేయాలి
– రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయండి : సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ ఆరోగ్య సిబ్బంది నిరసన
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న తమను రెగ్యూలర్‌ చేయాలని, కొత్తగా రిక్రూట్‌మెంట్‌ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని రెండో ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌)లు పోరుబాట పట్టారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 48 గంటల నిరసన కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 1520 ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ 2/2023ను రద్దు చేసి రెండో ఏఎన్‌ఎంలను రెగ్యూలరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 20 ఏండ్లుగా పని చేస్తున్న వీరి సర్వీస్‌కి.. ఉద్యోగాల భర్తీలో 20 శాతం వెయిటేజీ ఇస్తున్నట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో వీరిని ‘రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌’ మెరిట్‌ రోస్టర్‌ ప్రకారం ఎంపిక చేశారని, మళ్లీ పరీక్ష రాయమనడం సరికాదని తెలిపారు. ఇప్పటికే చాలా మందికి వయసు దాటి పోతుందని, వీరిని ఖాళీలు ఉన్న పోస్టులో రెగ్యులర్‌ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక వేళ ప్రభుత్వం పట్టించుకోకుంటే 15వ తేదీ నుంచి కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంపీహెచ్‌ఎ(ఎఫ్‌)లందరూ సమ్మెలోకి వెళ్తారని స్పష్టంచేశారు. కార్యక్రమం టీయూఎంహెచ్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు సంజూ జార్జ్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ప్రవీణ్‌ రెడ్డి, సలహాదారు వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి పుష్ప, షాదుల్లా, గంగజమున, వీణ, సరోజ, ప్రమీలతో పాటు జిల్లాలో ఉన్న 32 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.