మహిళా ఆర్థిక సాధికారతకు కృషి

– బ్రెజిల్‌ అధ్యక్షులు లూలా వెల్లడి
బ్రెసిలియ : మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, లింగ సమానత్వంతోపాటు, ఆర్థిక సమానత్వం కోసం లూలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు మహిళలకు అనుకూలమైన విధానాలను రూపొందించి.. వాటిని అమలు చేయనున్నట్లు బ్రెజిల్‌ అధ్యక్షులు లూలా ప్రకటించారు. బుధవారం రోజు (మార్చి 8)న బ్రెసిలియాలోని ప్లానాల్టో ప్యాలెస్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకులకు ఆయన హాజరయ్యారు. ఈ వేడుకల్లో లింగ సమానత్వానికి అనుకూలంగా బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలకు అక్కడ జీతం వర్తించనుంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నా..వారికంటే 22 శాతం తక్కువ జీతాన్ని పొందుతున్నారు. పనితోపాటు, జీతం సమానం కోసమే లూలా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కాగా, లూలా ప్రభుత్వం మహిళలకు అనుకూలమైన మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. రుతుక్రమ సమయంలో మహిళలు ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్‌ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. అలాగే 1,189 నర్సరీల నిర్మాణం చేపట్టనుంది. అక్కడ మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ‘లైవ్‌ వితౌట్‌ వయోలెన్స్‌’ ప్రోగ్రామ్‌ని మళ్లీ తిరిగి ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కోసం లూలా ప్రభుత్వం 72 మిలియన్‌ డాలర్లను కేటాయించనుంది. బ్రెజిలియన్‌ రాజకీయవేత్త, మానవహక్కుల కార్యకర్త అయిన మారియెల్‌ ఫ్రాంకోను తీవ్రవాదులు మార్చి 14న కాల్చి చంపారు. ఆమె చేసిన పోరాటాలకు గుర్తుగా హింసకు వ్యతిరేకంగా మార్చి 14వ తేదీన ‘మారియెల్‌ ఫ్రాంక్‌’డేగా లూలా ప్రభుత్వం జరపనుంది.