– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై శ్రామిక మహిళలు సంఘటిత పోరాటాల్లోకి రావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక మహిళల రాష్ట్ర స్థాయి శిక్షణాశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు కుల, మత, ప్రాంతీయ ఉన్మాదాలను రెచ్చగొడ్తూ మహిళలపై ముఖ్యంగా హింసను ప్రేరేపిస్తున్నాయన్నారు. మహిళలను అన్ని రంగాల్లోనూ అణచివేయాలని చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు తీవ్ర ప్రతిఘటన ఇవ్వాలని శ్రామిక మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కాసు మాధవి, తదితరులు పాల్గొన్నారు.