శ్రీలంక బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతకై ప్రపంచ బ్యాంక్‌ సాయం

World Bank's assistance for the stability of Sri Lanka's banking sectorకొలంబో : శ్రీలంక ఆర్థిక, వ్యవస్థాగత రంగాలను బలోపేతం చేసేందుకు ప్రపంచ బ్యాంక్‌ తాజాగా 150మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆమోదించింది. ఈ విషయాన్ని శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ శుక్రవారం తెలిపింది. ”ఆర్థిక రంగానికి మద్దతుగా బలమైన భద్రతా వ్యవస్థల అవసరాన్ని శ్రీలంక ఆర్థిక సంక్షోభం ప్రముఖంగా తెలియచెప్పింది. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సంస్థలు, వ్యక్తులు, చిన్న తరహా వ్యాపారాలు, నిరుపేద కుటుంబాలకు సుస్థిరమైన, విశ్వసనీయమైన బ్యాంకింగ్‌ రంగం చాలా అవసరం. ” అని మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంకలకు ప్రపంచ బ్యాంక్‌ కంట్రీ డైరెక్టర్‌ ఫరిస్‌ హదాద్‌ జెవోస్‌ పేర్కొన్నట్లు బ్యాంక్‌ తన ప్రకటనలో తెలిపింది. డిపాజిట్‌ బీమా పథకాలను బలోపేతం చేయడం మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో సహా చిన్న డిపాజిట్‌దారుల ఆదాయాలను పరిరక్షించేందుకు సహాయపడుతుందని ఫరిస్‌ పేర్కొన్నారు. అలాగే శ్రీలంక పునర్నిర్మాణంలో కీలకమైన ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని నింపేందుకు కూడా ఇది సాయపడుతుందని అన్నారు. శ్రీలంక డిపాజిట్‌ బీమా పథకం (ఎస్‌ఎల్‌డిఐఎస్‌) ఆర్థిక, వ్యవస్థాగత సామర్ధ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఆర్థిక రంగ భద్రతా వ్యవస్థ ప్రాజెక్టు రూపొందించబడింది. 2010లో ఈ డిపాజిట్‌ పథకాన్ని ఏర్పాటు చేశారు. నవంబరు 13న శ్రీలంక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిలవుట్‌ ప్యాకేజీ రెండవ విడత మొత్తం విడుదల కోసం శ్రీలంక ప్రస్తుతం ఎదురుచూస్తోంది.