జూన్‌ 7,8 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ప్రపంచ వరి’ సదస్సు

– మంత్రి తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జూన్‌ 7,8 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలో ‘ప్రపంచ వరి’ సదస్సు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరయ్యే ఈ సదస్సుకు సన్నాహాలు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. సదస్సు నిర్వాహకులు, అంతర్జాతీయ పంటల సంస్థ ఇంటర్నెషనల్‌ డైరెక్టర్‌ మెర్సీడేజ్‌ జోన్స్‌, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అల్తాస్‌ జానయ్య శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మలతో సమావేశమయ్యారు. సదస్సు నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా 150 మంది వరి ధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతోపాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు, అభ్యుదయ రైతులు, రైస్‌మిల్లరు తదితరులు పాల్గొంటారని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా తెలిపారు. ఏయే దేశాల్లో ఏరకం వరికి డిమాండ్‌ ఉన్నదో ఈ సదస్సులో తెలుసుకునేందుకే అత్యుత్తమ యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.