గెలవాలి అనే లక్ష్యంతో వచ్చిన వారు ఓడిపోతారు.. ఓడిపోతాం అనే భయంతో వచ్చినవారూ ఓడిపోతారు.. బాగా ఆడాలి అనే తపనతో వచ్చిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు.. అంటే గెలుపు, ఓటములు అనే లక్ష్యాన్ని పక్కన పెట్టి ‘బాగా ఆడాలి’ అనే దానిపైనే దష్టి పెట్టిన వారు విజయం సాధిస్తారు. ఒకవేళ ఓటమి చవి చూసినా క్రీడా స్ఫూర్తితో ఆ క్రీడను ఆస్వాదిస్తారు. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియరీ డి కూబెర్టిన్ ప్రధాన ఆశయం కూడా ఇదే. జీవితంలో ముఖ్యమైన విషయం జయించడమే కాదు, బాగా పోరాడడం కూడా. ఇదే క్రీడలకు కూడా వర్తిస్తుంది. ఏ క్రీడ అయినా గెలుపొందడం కంటే పాల్గొనడం చాలా ముఖ్యమని ఆయన ప్రధాన సందేశం. మొదటి స్థానంలో నిలబడటం అనే ఆత్రుత పక్కన పెట్టి పాల్గొనడం, బాగా ఆడటం క్రీడల ఆశావాద దక్కోణంగా క్రీడాకారులందరూ గుర్తించాలనేది ఒలింపిక్ క్రీడల ప్రధాన సందేశం. పపంచాన్ని మార్చే శక్తి, స్ఫూర్తినిచ్చే శక్తి క్రీడలకు ఉంది. అంతే కాదు మరెవ్వరూ చేయని విధంగా ప్రజలను ఏకం చేసే శక్తీ క్రీడలకు ఉంది. దీనిని నిరూపిస్తూ నిర్వహిస్తున్న క్రీడలే ఒలింపిక్ క్రీడలు. ఎన్నో క్రీడలు.. మరెన్నో దేశాలు.. ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పోటీపడే విశ్వ వేదిక ఒలింపిక్స్. ప్రపంచంలో ఐదు ఖండాలను ఒక్కతాటిపైకి తెస్తూ.. నాలుగేండ్లకోసారి జరిగే క్రీడా పండుగ ఒలింపిక్స్. జూన్ 23 తేదీ అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం సందర్భంగా ఖండాంతర ఖ్యాతినార్జించి పెట్టే ఈ ఒలింపిక్ క్రీడల చరిత్ర, ప్రస్తుత ఒలింపిక్ క్రీడలు, ఒలింపిక్ క్రీడల్లో భారత్ పాత్ర… ఇత్యాది విషయాలపై సోపతి ప్రత్యేక కథనం…
ఒలింపిక్స్ విశ్వ క్రీడా సంబరాలు ఈనాటివి కావు. వీటికి 3000 ఏండ్ల చరిత్ర ఉంది. వీటి పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దంలో ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం అనేక రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. ఆ సమయంలో రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. దీనివల్ల గ్రీకు సామ్రాజ్యంలో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉండేది. దీనికి పరిష్కారంగా యుద్ధాలు నిలిపివేసి శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి క్రీడలు ఒక్కటే పరిష్కారం చూపుతాయని గ్రహించి, గ్రీకులు రాజ్యాల మధ్య క్రీడలు నిర్వహించడం అత్యుత్తమ పరిష్కారంగా భావించారు. దాని కోసం తొలిసారి క్రీ.పూ.776లో దక్షిణ గ్రీసులో ఒలింపియా అనే ప్రాంతంలో క్రీడల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రీడోత్సవాల సమయంలో యుద్ధాలు కూడా నిలుపదల చేయాలని తీర్మానం కూడా చేశారు. వీటినే ప్రాచీన ఒలింపిక్ క్రీడలుహొఅంటారు. ప్రారంభంలో ఈ క్రీడలను ఒక రోజు మాత్రమే నిర్వహించగా కాలక్రమేణా క్రీడల పట్ల జనాదరణ పెరగడంతో పోటీలు నిర్వహించే రోజుల సంఖ్య, క్రీడల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్రీడలు జరుగుతున్నన్ని రోజులు ప్రజలు తమ పనులు కూడా పక్కనపెట్టి చూడటానికి ఆసక్తి చూపేవారు.
ఆధునిక ఒలింపిక్ క్రీడలు : ఏథెన్స్‌లో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలలో అథ్లెటిక్స్, సైక్లింగ్, కత్తియుద్ధం, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, మల్లయుద్ధం వంటి 9 రకాల క్రీడలు మధ్య పోటీలు జరిగేవి. తర్వాత పోటీ అంశాలు పెరుగుతూ వచ్చాయి. అప్పట్లో ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు. అయితే రోమ్ చక్రవరి థియోడొసియస్ గ్రీస్ సామ్రాజ్యాన్ని జయించాక ఈ ఒలింపిక్ క్రీడలను పూర్తిగా నిషేధించాడు. తర్వాత కాలంలో ఒలింపస్ పట్టణం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది. ఈ కారణంగా క్రీస్తు శకం 393లో ఒలింపిక్స్ క్రీడలు కూడా నిలిచి పోయాయి. అయితే ఫ్రాన్స్ చరిత్రకారుడు చార్లెస్ పియెర్ డి ఫ్రెడీ, బెరోన్ డి కౌబర్టిన్ తమ ప్రాంతంలోని యువతను విద్యావంతులను చేయాలని, అందరూ ధఢమైన శరీరం, మంచి ఆరోగ్యం ఉండేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది సాధించాలంటే ముందుగా యువతీయువకులకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించి, తద్వారా విద్యాప్రక్రియను విస్తతపరచాలనుకున్నాడు. ఒలింపియా శిథిలాలను సందర్శించిన తర్వాత అతడి మనసులో రూపుదిద్దుకున్న పథకమే ఆధునిక ఒలింపిక్ క్రీడలు. ఇలా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 1894లో ఏర్పడటానికి ఆయన కారకుడయ్యాడు. పారిస్ నగరంలోనే మొట్టమొదటి ఒలింపిక్స్ జరపాలని ఆయన భావించాడు. అయితే ప్రపంచ క్రీడల పోటీలను గ్రీసులోని ఏథెన్స్ పట్టణం నుండే ఆరంభించాలని ఎక్కువ దేశాలు సూచించాయి. ఆ విధంగా మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896లో ఏథెన్స్‌లో ప్రారంభించారు. కేవలం ఈయన కషి వల్లనే ప్రాచీన క్రీడలు ఎక్కడైతే ఆగి పోయాయో అక్కడి నుండే 1896లో ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి.
విశ్వ క్రీడలుగా ప్రసిద్ధి : 1924హొనుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధసమయంలో (1916), తిరిగి రెండవ ప్రపంచయుద్ధ సమయంలో (1940, 1944) ఈ క్రీడలను నిర్వహించడం సాధ్యం కాలేదు. ప్రాచీన కాలంలో మరుగున పడిన ఒలింపిక్ క్రీడలకు తిరిగి జీవం పోసిన ఘనత క్రీడాపండితుడు పియరీ డి కోబర్టీన్ కే దక్కడం చేత అతనిని ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా పేర్కొంటారు. 14 దేశాలు, 241 అథ్లెట్లతో కేవలం పురుష క్రీడాకారులతో మొదలైన ఈ ఆధునిక ఒలింపిక్స్ ఇప్పుడు 200 పైచిలుకు దేశాల నుంచి 11 వేల క్రీడాకారులతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్ నిలిచింది. ఒక పక్క పురాతన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే నాలుగేండ్లకు ఒకసారి వీటిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ప్రజలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం ఒలింపిక్స్ కల్పిస్తున్న కారణంగా ఇవి ‘విశ్వ క్రీడలు’ గా ప్రసిద్ధి చెందాయి. నిరాటంకంగా జరుగుతు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు వీటిని బహిష్కరిస్తున్నాయి.
ఒలింపిక్ క్రీడల చిహ్నం : తెల్లని పట్టుగుడ్డ మీద ఒకదానితో ఒకటి కలిసిన ఐదు రంగు రంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నం ఒలింపిక్ పతాకంలో కనిపిస్తుంది. ఈ పతాకంలో పైన 3 వలయాలు, కింద 2 వలయాలు మొత్తం అయిదు వలయాలు కనిపిస్తాయి. ఈ అయిదు వలయాల అర్థం ఐదు ఖండాలు: 1.యూరప్, 2.ఆసియా, 3.ఆఫ్రికా, 4.ఆస్ట్రేలియా, 5.అమెరికా కలసి ఉన్నట్లు అర్థం. ఈ ఐదుహొవలయాలు వరుసగాహొనీలంహొపసుపుపచ్చ,హొనలుపు,హొఆకుపచ్చ,హొఎరుపుహొరంగుల్లో ఉంటాయి. వలయాల మాదిరిగా అయిదు ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. ఈ ఐదు రింగులు ప్రజల క్రీడాస్ఫూర్తికి, సౌభ్రాతత్వానికి చిహ్నం భావిస్తారు. 1913లోహొరూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1920 బెల్జియంలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఎగురవేశారు.
ఒలింపిక్ జ్యోతి : ఒలింపిక్ జ్యోతి మొదటిసారిగా 1928 ఆమ్‌స్టర్‌డామ్ క్రీడల్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత జ్యోతి 1936 బెర్లిన్ క్రీడలు నుండి కొనసాగిస్తున్నారు.
ఆతిథ్య నగర ఎంపిక : విశ్వ ప్రాధాన్యం కలిగిన ఒలింపిక్ క్రీడలు నిర్వహించే ఆతిధ్య నగరం ఎంపిక చిన్న విషయం కాదు. అనేక వడపోతల నడుమ ఒలింపిక్స్ నిర్వహించడానికి ముందుకు వచ్చే దేశాల అభ్యర్ధనలను పరిశీలించి ఈ వేదికను నిర్ణయిస్తారు. ఈ బాధ్యతను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చేపడుతోంది. దరఖాస్తు చేసిన వాటిని మూడు దశల్లో వడపోసి చివరకు అతిథ్య నగరాన్ని ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో మొదట ఇన్విటేషన్ ఫేజ్ ఉంటుంది. అందులో వివిధ దేశాల ఒలింపిక్ కమిటీలు తమ దేశంలో ఆసక్తి చూపుతున్న నగరాల బిడ్‌లను ఐఓసీ ముందుకుతెస్తాయి. ఆ తరువాత మూడు దశలుంటాయి. అవి 1) విజన్, గేమ్స్ కాన్సెప్ట్, లెగసీ; 2) గవర్నెన్స్, లీగల్ అండ్ వెన్యూ ఫండింగ్; 3) గేమ్స్ డెలివరీ, ఎక్స్‌పీరియన్స్ అండ్ వెన్యూ లెగసీ. ఆయా నగరాలు ఈ మూడు అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఐఓసీ ఎవల్యూషన్ కమిషన్ ప్రతి దశకు ఆతిథ్య నగరంలో ఉన్న క్రీడా సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలున్న స్టేడియంలు, క్రీడాకారుల శిక్షణ కోసం అవసరమైన ఇతర స్టేడియంలు, వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, వారి సిబ్బంది, పర్యాటకులు, జర్నలిస్టులకు వసతి, రవాణా సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీటితో పాటు ఐఓసీ నిబంధనల ప్రకారం కాలుష్యం, వథాల నిర్వహణ, పర్యావరణంపై వాటి ప్రభావం వంటి అంశాలనూ పరిశీలన చేసిన అనంతరం ఎవల్యూషన్ కమిషన్ కొన్ని నగరాల పేర్లతో తుది నివేదికను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు సమర్పిస్తుంది. ఇలా వివిధ దశల అనంతరం తుది జాబితా సిద్ధం చేస్తారు. చివరిగా ఐఓసీ సభ్య దేశాల ప్రతినిధులు రహస్య బ్యాలట్ పద్ధతిలో ఓట్ వేసి ఒలింపిక్స్ నిర్వహించే నగరాన్ని ఎంపిక చేస్తారు. దీనిలో ఐఓసీ గౌరవ సభ్యులుకు, సస్పెండైన మెంబర్లకు ఓటు హక్కు ఉండదు. ప్రస్తుతం ఈ ఐఓసీలో 102 మంది సభ్యులున్నారు. భారత్ నుంచి నీతూ అంబానీ సభ్యురాలిగా ఉన్నారు. ఈ ప్రక్రియ మొత్తం హడావిడి లేకుండా ఒలింపిక్స్ జరిగే ఏడాదికి కనీసం ఏడేండ్ల ముందే జరిపి ఆతిథ్య నగరాన్ని నిర్ణయిస్తారు. ఒలింపిక్స్ నిర్వహణకు పోటీపడే నగరం 1.5 లక్షల డాలర్ల రుసుం చెల్లించవలసి ఉంటుంది. ఐఓసీ నుంచి కూడా ఆర్థిక మద్దతు ఉంటుంది.
క్రీడల ఎంపిక : ప్రపంచంలో చాలాక్రీడలు ఉన్నాయి. అయితే ఒక్కో దేశంలో ఒక్కో క్రీడకు ప్రాధాన్యం ఉంటుంది. నాలుగేండ్లకు ఓసారి జరిగే ఒలింపిక్స్‌లో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అమలులో గల అన్ని క్రీడలకు అవకాశం ఉండదు. ప్రతీ ఒలింపిక్‌లో కొన్ని క్రీడలు చేర్చుతుంటారు. గత టోక్యో ఒలంపిక్స్‌లో 33 క్రీడలు మాత్రమే ఉన్నాయి. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో లేని ఐదు క్రీడలను టోక్యోలో చేర్చారు. అయితే ఒలింపిక్ ఓ నూతన క్రీడను చేర్చడం అంత సులభం కాదు. ఆతిధ్య నగరాన్ని ఎంపిక చేయడంలో ఎంత క్లిష్టత ఉంటుందో క్రీడలను చేర్చడంలో కూడా అదే తీరు ఉంటుంది. ముందుగా ఆ క్రీడ ఒలింపిక్ స్థాయికి తగినదై ఉండాలి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)కి అనుబంధంగా ఉండే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ దాన్ని గుర్తించాలి. పురుషుల్లో అయితే ఆ క్రీడ కనీసం 75 దేశాలు, నాలుగు ఖండాల్లో… అదే మహిళల్లో అయితే 40 దేశాలు, మూడు ఖండాల్లో ఆడుతుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా అది ఫిజికల్ స్పోర్ట్ అయి ఉండాలి. ఈ అర్హతలు ఉండే ఆటకు ఒలింపిక్స్ హోదా ఇవ్వాలని కోరుతూ సదరు స్పోర్ట్స్ ఫెడరేషన్ ఐఓసీకి దరఖాస్తు చేయాలి. దానిని క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆటను రాబోయే ఎడిషన్ ఒలింపిక్‌లో చేర్చాలని సిఫారసు చేస్తుంది. ఆ తర్వాత ఐఓసీ సెషన్ దీనికి అప్రూవల్ ఇస్తే అప్పుడు ఆ క్రీడను ఒలింపిక్‌లో చేరుస్తారు. ఒలింపిక్స్‌లోని క్రీడల సంఖ్య వేసవి నుండి వింటర్ గేమ్‌లకు మారుతుంది. నియమం ప్రకారం వేసవి ఒలింపిక్స్‌లో 33, వింటర్ ఒలింపిక్స్‌లో 15 క్రీడలు ఉంటాయి.
ఒలింపిక్స్‌లో మహిళలు : క్రీడాకారులు పాల్గొనడం 1900 నుంచి మొదలయ్యింది. మొదట్లో కేవలం 6 గురు మహిళలు మాత్రమే పాల్గొన్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా క్రీడాకారుల శాతం 48శాతానికి చేరుకుంది.
ఒలింపిక్ షెడ్యూల్ : ఏ కారణం చేతనైనా నిర్దేశించిన షెడ్యూల్ నిలిచిపోతే, వాటిని జరిగినట్టుగానే భావించి అది ఎన్నో ఒలింపిక్ క్రీడో నిర్ణయిస్తారు. ఉదాహరణకి టోక్యో ఒలంపిక్స్ 23వది అనుకుంటే. అనివార్య కారణాలు వల్ల నిర్వహించలేక పోయినా, తర్వాత వచ్చే ఒలింపిక్ క్రీడలను 24వ ఒలింపిక్ అని ప్రకటిస్తారు.
పర్యావరణ పరిరక్షణ : ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. దీనికి కారణం అధిక కర్బన ఉద్గారాలు విడుదల చేసే ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వధాలు. వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్ధలు కషి చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అయితే ఒలింపిక్ తరహా విశ్వక్రీడలు నిర్వహిస్తున్నప్పుడు పర్యావరణానికి మరింత హాని జరిగే ప్రమాదముంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ఒలింపిక్ కమిటీ కొన్ని సూచనలు చేస్తుంది. వీటి ఆధారంగానే జపాన్, టోక్యోలో నిర్వహించే ఒలింపిక్స్‌లో ‘బి బెటర్ టు గెదర్ ఫర్ ప్లానెట్ అండ్ పీపుల్’ అనే ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో ఒలింపిక్స్ నిర్వహించింది. 2020లో జరిగిన ఒలింపిక్ క్రీడల ద్వారా దానిని ఆచరణలో పెట్టాలని మూడేండ్ల ముందే వ్యూహం రచించింది. టన్నుల కొద్దీ పోగు చేసిన ఎలక్ట్రానిక్ వధాలను రీ సైకిల్ చేసి దానిని ఉపయోగించి ఒలింపిక్ విజేతలకు ఎలక్ట్రానిక్ వధాలతో పతకాలు తయారుచేసి అందించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా రీసైకిల్డ్ పతకాలు రూపొందించి విజేతలకు అందించారు. పారిస్‌లో 2024లో జరగనున్న ఒలింపిక్స్‌లో ముఖ్య నినాదాలు ‘సామాజిక మార్పు, పర్యావరణ సంరక్షణను ప్రోత్సహించటం’. దీన్ని బట్టి పారిస్ ఒలింపిక్ కూడా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని తెలుస్తుంది.
ఒలంపిక్స్‌లో క్రికెట్ : 1896లో తొలి ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించినప్పుడు క్రికెట్ కూడా అందులో భాగంగా ఉండాల్సి ఉంది. కానీ అప్పుడు క్రికెట్ ఆడే జట్లు లేకపోవడంతో దీన్ని తప్పించారు. నాలుగేండ్ల తర్వాత 1900లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. కానీ క్రికెట్‌తో ఎటువంటి సంబంధం లేని ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ జరిగాయి. ఆ ఒక్కసారి మాత్రమే ఒలింపిక్స్‌లో క్రికెట్ చోటు దక్కించుకుంది. అయితే విశ్వ క్రీడల వేదిక ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదనే లోటు మాత్రం చాలాకాలంగా ఉంది. ఈ సందర్భంలో 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశపెట్టారు. క్రికెట్ ప్రవేశ పెట్టడం వలన మన దేశానికి పతకాలు వచ్చే అవకాశాలు మెరుగయ్యాయనే చెప్పవచ్చు.
ఒలింపిక్స్‌లో భారత్.. : ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రస్థానం మొదలై ఇప్పటికి 123 ఏండ్లు గడిచాయి. ఆధునిక ఒలింపిక్స్ తొలిసారి 1896లో ఏథెన్స్‌లో ప్రారంభమయ్యాయి. కానీ అప్పుడు భారత్ నుంచి ఒక్కరు కూడా ప్రాతినిథ్యం వహించలేదు. 1900లో ఫ్రాన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిథ్యం లభించింది. అప్పట్లో భారత్‌కు స్వతంత్రం రాలేదు. దీంతో బ్రిటిష్-ఇండియా పేరుతో అథ్లెట్లు క్రీడల్లో పాల్గొనేవాళ్లు. 1900 ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో నార్మన్ గిల్బర్ట్ ప్రిచర్డ్ అనే అథ్లెట్ భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 200 మీటర్ల పరుగులో రజత పతకం గెలిచాడు. 200 మీటర్ల హార్డిల్స్‌లో కూడా రజతం గెలిచాడు. ఇండియా తరపునే కాకుండా ఆసియా తరపున ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచిన అథ్లెట్‌గా రికార్డు సష్టించాడు. ఆసియా తరపున మొట్టమొదటి సారి భారత అథ్లెట్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 20 ఏండ్లకు బెల్జియం ఒలింపిక్స్, 1924 పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బందం ఎలాంటి పతకాలు గెలవకుండానే ఇంటికి తిరిగి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పడింది. దీంతో 1928 ఒలింపిక్స్‌కు ఇండియా నుంచి ఏడుగురు అథ్లెట్లతో పాటు హాకీ జట్టును కూడా పంపారు. ఆ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఏకంగా స్వర్ణ పతకం సాధించింది. పాల్గొన్న తొలి క్రీడల్లోనే స్వర్ణ పతకం సాధించిన జట్టుగా భారత హాకీ జట్టు రికార్డు సష్టించింది. అంతే కాకుండా 1926 నుంచి 1956 వరకు వరుసగా ఆరు సార్లు స్వర్ణ పతకం సాధించి ఒలింపిక్స్ హాకీ ఈవెంట్‌లో భారత జట్టు ఎవరికీ అందని ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టక పోవడం విశేషం. 1960 రోమ్‌లో హాకీ జట్టు రాణించలేక పోయినా 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కొట్టింది. ఆ తర్వాత జరిగిన రెండు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పతకమే సాధించని హాకీ జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. భారత జట్టుకు హాకీలో అదే చివరి పతకం కావడం గమనార్హం.
మాస్కోలో హాకీ జట్టు పతకం సాధించిన తర్వాత ఇండియాకు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా రాలేదు. ఎన్నిసార్లు ఒలింపిక్స్‌కు వెళ్లినా అందరూ ఖాళీ చేతులతోనే ఇంటిదారి పట్టారు. అయితే 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండప్ పేస్ కాంస్య పతకం సాధించాడు. 16 ఏండ్ల తర్వాత భారత జట్టుకు కాంస్య పతకం రావడమే కాదు 44 ఏండ్ల తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సష్టించాడు. అంతకు ముందు 1952లో డీకే జాదవ్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో వ్యక్తిగత కాంస్యం సాధించాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది.
2004లో ఎవరూ ఊహించని విధంగా రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ డబుల్ ట్రాప్ షూటింగ్‌లో రజతం సాధించాడు. ఆ ఏడాది 74 మంది అథ్లెట్లు వెళ్లగా.. కేవలం ఓకే రజతంతో తిరిగి వచ్చారు. అయితే భారత ఒలింపిక్ చరిత్రలో వ్యక్తిగత రజతం గెలిచిన తొలి అథ్లెట్‌గా రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ రికార్డులకు ఎక్కాడు. ఇక 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా షూటింగ్‌లో ఏకంగా స్వర్ణ పతకం సాధించాడు. భారత్ తరపున వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఏకైన అథ్లెట్‌గా ఇప్పటికీ బింద్రా రికార్డు చెక్కు చెదరలేదు. అదే ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్యం సాధించి రెజ్లింగ్‌లో పతకం గెలిచిన రెండో రెజ్లర్‌గా రికార్డులకు ఎక్కాడు. బాక్సర్ విజేందర్ సైతం కాంస్యం సాధించడం విశేషం.
2012 లండన్‌లో 83 మంది అథ్లెట్లు భారత్ తరపున వెళ్లగా మొత్తం ఆరు పతకాలు తమ ఖాతాలో వేసుకున్నది. 2016లో 117 మంది రెజ్లర్లను పంపగా కేవలం రెండే పతకాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, మహిళల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్యం నెగ్గింది. నిజానికి ఇప్పటి వరకు గడచిన 24 ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల సంఖ్యకూ, సాధిస్తున్న పతకాలకూ మధ్య నిష్పత్తి ఏమంత గొప్పగానూ లేదు. పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా భావించే స్ధితి మనది. గత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా మహిళలే ఇండియా పరువు నిలబెట్టారు.
అయిదేండ్లుగా ప్రభుత్వం, ఆటగాళ్ళు శ్రమిస్తున్నారు. కేంద్రం 1169 కోట్ల ఖర్చుతో 18 జాతీయ క్రీడా సమాఖ్యలకూ, 128 మంది ఒలింపిక్ క్రీడాకారులకు అండగా నిలిచింది. ఖేలో ఇండియా క్రీడలకు తెరతీసింది. ఒలింపియన్ల కోసం టాప్ పథకం తీసుకొచ్చింది. అయితే ఈ చిరు ప్రయత్నాలతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్ల సంఖ్య మాత్రమే పెరిగింది తప్ప పతకాలు మాత్రం పెద్దగా లేవు. ఎందుకంటే 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో క్రీడాకారులను తయారు చేయడం కంటే క్రీడా రాజకీయాలు ఎక్కువ.హొఒలింపిక్స్‌హొనుంచి క్రికెట్ అసోసియషన్స్ వరకు రాజకీయ నాయకుల జోక్యంతో భ్రష్టుపట్టి పోతున్నాయని క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విశ్వ క్రీడల్లో మనం ఎక్కడున్నామో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. నాలుగేండ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌లో ప్రతిసారీ సగటున ఒక్కటి కూడా భారత్ సాధించలేకపోయింది. మనకంటే చిన్న దేశాలు, పేద ఆఫ్రికన్ దేశాలు కూడా భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయంటే మనం క్రీడల పట్ల చూపే శ్రద్ధ అర్ధమవుతుంది.
భారత్‌లో ఒలింపిక్స్ సాధ్యం కాదా? : యూరప్‌లోని చిన్న చిన్న దేశాలలోని నగరాలు కూడా ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చాయి. జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి ఆసియా దేశాలు కూడా ఈ క్రీడలను నిర్వహించాయి. అమెరికాలో అయితే అనేక నగరాల్లో ఒలింపిక్స్ జరిగాయి. లండన్, లాస్‌ఏంజెల్స్, పారిస్ వంటి నగరాల్లో మూడేసి సార్లు సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఎక్కువసార్లు ఆతిథ్యమిచ్చిన దేశంగా అమెరికా నిలిచింది. కానీ భారత్‌లో మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా నిర్వహించే అవకాశం రాలేదు. అంతేకాదు.. మరో పదేండ్లు అంటే 2032 వరకు కూడా భారత్‌లోని ఏ నగరంలోనూ నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే 2026 వింటర్ ఒలింపిక్స్ ఇటలీలోని మిలన్‌లో, 2028 సమ్మర్ ఒలింపిక్స్ అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో, 2032 సమ్మర్ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయమైపోయింది. అయితే 2036లో జరిగే ఒలింపిక్స్ నిర్వహించడానికి ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ మండలి సమావేశ అనంతరం ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో భారత్ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కితే అది భారత్‌కే గర్వకారణం. దక్షిణాసియా దేశాలలో ఈ ఘనత దక్కించుకొన్న తొలిదేశంగా కూడా భారత్ నిలువగలుగుతుంది. అయితే ఆర్థికంగా పలు రకాల సమస్యలతో సతమతమవుతున్న భారత్‌కు లక్షలకోట్లు ఖర్చు చేసి ఒలింపిక్స్ నిర్వహించే సామర్థ్యం ఉందా అని ఆర్థికనిపుణులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గ్రీస్, బ్రెజిల్, జపాన్ లాంటి దేశాలు ఆతిథ్యమిచ్చి ఆర్ధికంగా ఇక్కట్లు ఎదుర్కొన్న వాస్తవాన్ని భారత్ గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు. గతంలో 70 దేశాలు పాల్గొన్న కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికే నానాపాట్లు పడి, పలు విమర్శలు ఎదుర్కొన్న మనం 200 దేశాలు పైబడి పాల్గొనే ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం ఉందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీన్ని దష్టిలో ఉంచుకుని భారత్ ఒలింపిక్ ఆతిధ్య నగరం ఆత్రుత పక్కన పెట్టి, ఒలింపిక్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు సంపూర్ణ ప్రోత్సాహకాలు ఇవ్వగలిగితే మన దేశం ఎక్కువ పతకాలు సాధించగలుగుతారు. మన దేశ ప్రతిష్ఠ ఒలింపిక్స్ ఆతిధ్య నగరం ద్వారా కన్నా మన క్రీడాకారులు ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలు ద్వారానే సాధించవచ్చనే సత్యాన్ని పాలకులు గుర్తించాలి. దీనికై విద్యా విధానంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ క్రీడా సంస్కతి మన దేశంలో వద్ధి చెందే విధంగా ప్రణాళికా బద్ధమైన చర్యలు చేపట్టాలి.
పారిస్ ఒలింపిక్స్ : పారిస్ ఒలంపిక్స్ కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఇంకా 36 రోజుల్లో పారిస్ వేదికగా… మరో మహత్తర క్రీడా సమరానికి క్రీడాప్రపంచం సన్నద్ధమైంది. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి దేశాలు… క్రీడాంశాల్లో తమ అదష్టాన్ని పరీక్షించుకునేందుకు క్రీడాకారులు సర్వసన్నద్ధమై ఉన్నారు. పారిస్‌లో జరగనున్న విశ్వక్రీడల నినాదాన్ని కూడా నిర్వాహకులు ప్రకటించారు. ఆటలు విస్తతంగా బహిర్గతమవ్వాలి అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నినాదంతో పాటు మరింత కలుపుగోలుతనంతో, సోదరభావంతో క్రీడల్లో పాలు పంచుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ పోటీలకు ఇప్పటివరకూ 4,600 మంది అథ్లెట్లు అర్హత సాధించారు
పారిస్ ఒలింపిక్ ప్రత్యేకతలు : ఈ విశ్వ క్రీడలలో పర్యావరణ పరిరక్షనే కాకుండా ఆర్థికపరంగా పొదుపు సూత్రాలను పాటించి ఒలింపిక్ నిర్వహణా వ్యయం తగ్గించాలని ప్రస్తుతం జరగబోయే పారిస్ ఒలింపిక్ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం గత టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో జరిగిన వ్యయం కన్నా సగ భాగం తగ్గించే విధంగా కార్యాచరణను రూపొందించారు.
వేదిక మార్పు : ఇప్పటి వరకూ జరిగిన ఒలింపిక్ క్రీడలు ప్రారంభ ఉత్సవం కానీ ముగింపు కార్యక్రమాలు వేదికల దగ్గరే జరిపేవారు. అయితే ప్రస్తుత ఒలింపిక్స్‌లో పై రెండు కార్యక్రమాలు కూడా వేదిక ఆవల ఉన్న ‘సెన్’ నది ఒడ్డున ఏర్పాట్లు చేశారు
జెండర్ ఈక్వలిటీ పాటించాలి : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2015లో కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ రూల్స్ ప్రకారం ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళల కేటగిరీలో పోటీ చేసేందుకు అర్హులు. మహిళలు, ట్రాన్స్ జెండర్లను తక్కువ చేసేలా ఎలాంటి ప్రకటనలు, కామెంట్లు ఉండకుండా జాగ్రత్త పడాలని పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ కీలక గైడ్‌లెన్స్‌ను విడుదల చేసింది
పారిస్ ఒలింపిక్ శరణార్ధుల జట్టు : మరికొద్దిరోజుల్లో పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టును అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) ప్రకటించింది. ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు ప్రాతినిథ్యం వహించడం ఇది మూడోసారి. ఈసారి విశ్వక్రీడలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శరణార్థులకు ప్రాతినిథ్యం వహించే 11 దేశాలకు చెందిన 36 మంది అథ్లెట్లు.. బాక్సింగ్, కనోరు, సైక్లింగ్ వంటి 12 క్రీడల్లో అదష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం : ప్రజలందరినీ క్రీడలు మాత్రమే ఏక తాటిపైకి తీసుకురాగలవు అనే ప్రధాన ఆశయంతో, వయసు, లింగం, కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఒలింపిక్ క్రీడలలో పాల్గొనడానికి, వివిధ రకాల క్రీడల గురించి అవగాహన కల్పించడానికి 1948లో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతి ఏడాది జూన్ 23న ఆధునిక ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి గుర్తుగా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ ప్రముఖ వేడుకల్లో ఒకటి ఒలింపిక్ డే రన్. ఇది 1987లో ప్రారంభించబడింది. 1987లో మొదటి ఒలింపిక్ డే రన్ జరిగినప్పుడు కేవలం 50 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఇప్పుడు 150 కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయి.హొ
ఈ రోజు క్రీడల గురించి ప్రదర్శనలు, విద్యా సదస్సులు కూడా నిర్వహిస్తారు. ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో ఒలింపిక్ ఆవశ్యకతను తెలియజేస్తారు. 2024 థీమ్‌హొ’ఐక్యత మరియు స్థితిస్థాపకత’.
పారిస్ వేదికగా జులై 26 నుండి జరగబోయే ఒలింపిక్స్‌లో క్రీడాభిమానులు, నిపుణుల అంచనాలకు అనుగుణంగా మన క్రీడాకారులు భారత్ పతాకాన్ని పారిస్ వినువీధుల్లో గర్వంగా ఎగురవేస్తారని, పతకాల పంట పండిస్తారని ఆశిద్దాం.
– రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578