భారత్‌ వైపే ప్రపంచ చూపు

భారత్‌ వైపే ప్రపంచ చూపు– వైబ్రెంట్‌ గుజరాత్‌లో ప్రధాని మోడి
గాంధీనగర్‌ : ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. ప్రపంచ ఆర్థికాభివృద్థికి మూల స్తంభంగా భారత్‌ను భావిస్తున్నాయన్నారు. బుధవారం ఆయన వైబ్రెంట్‌ గుజరాత్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్థిలో స్థిరత్వానికి మూల స్తంభంగా, ప్రతిభావంతులైన యువత కలిగిన శక్తివంతమైన కేంద్రంగా భారత్‌ను అంతర్జాతీయ సమాజం చూస్తోందన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతోందని అంతర్జాతీయ ఏజెన్సీలు పేర్కొంటున్నాయన్నారు.
వైబ్రెంట్‌ గుజరాత్‌కు యుఎఇ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిన్‌ జాయిద్‌ రాక ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. వచ్చే 25 ఏండ్లలో భారత్‌ను అభివృద్థి చెందిన దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గుజరాత్‌లో అదానీ గ్రూప్‌ పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లు
వచ్చే ఐదేండ్లలో గుజరాత్‌లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూపు చైర్మెన్‌ గౌతం అదానీ వెల్లడించారు. 2025 నాటికి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో రూ.55 వేల కోట్ల వ్యయం చేయనున్నామన్నారు. ప్రధాని మోడి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాకుండా.. ఆచరణలోనూ తీర్చిదిద్దారన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్థి చెందిన దేశంగా అవతరించబోతోందన్నారు. గుజరాత్‌ కచ్‌ జిల్లాలోని ఖావ్‌డాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన పార్కును నిర్మిస్తున్నట్టు అదానీ తెలిపారు.
అత్యంత విజయవంతమైన ప్రధాని మోడీ : ముకేశ్‌ అంబానీ
భారత దేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ అత్యంత విజయవంతమైన ప్రధానిగా నిలువనున్నారని ముకేశ్‌ అంబానీ అన్నారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో అంబానీ మాట్లాడుతూ.. ఈ తరంలో ప్రపంచంలోనే గొప్ప నాయకుడని ప్రశంసించారు. భారత ప్రధాని తన పట్టుదల, సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారన్నారు. గుజరాత్‌లోని హజీరాలో దేశంలోనే తొలి ప్రపంచ స్థాయి కార్బన్‌ ఫైబర్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గడిచిన పదేండ్లలో దేశ వ్యాప్తంగా రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను చేపట్టామన్నారు. దీంట్లో మూడో వంతు గుజరాత్‌లోనే వెచ్చించినట్టు వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ 35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఒక్క గుజరాత్‌ రాష్ట్రమే మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు.