ప్రపంచ దేశాలు ‘అల్లీస్ (ఫ్రాన్స్, యుకె, యుఎస్, యుఎస్‌ఎస్‌ఆర్, చైనా, పోలాండ్)’, ‘ఆక్సిస్ (జర్మనీ, జపాన్, ఇటలీ)’ అనబడే రెండు జట్లుగా ప్రపంచ ముఖ్య దేశాలు విడిపోయి 1939 నుంచి 1945 వరకు జరిగిన భీకర రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 100 మిలియన్ల జనాభా పాల్గొనడం, 85 మిలియన్ల సైనిక/సామాన్య ప్రజల అపార ప్రాణ నష్టం, తొలి అణుబాంబుల విధ్వంసకర (హిరోషిమా, నాగసాకి) భయానక అనుభవాలు, యుద్ధ అనంతర కరువులు, వ్యాధుల వ్యాప్తి పీడలు, ఆస్తి విధ్వంసాలు, మారణహోమాలు, నరమే ధాలు, అపార ఆర్థిక కుదుపులతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత చేదు అనుభవాలను చవిచూశాయి. ‘ఆక్సిస్’ వర్గపు జర్మనీ, జపాన్ తదితర దేశాలు అపార ఆస్తి ప్రాణ నష్టాలను నమోదు చేసుకోవడం, కనీసం 12 మిలియన్ల ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరం. విజేతలైన ‘అల్లీస్’ వర్గంలో కూడా దాదాపు 61 మిలియన్ల ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తున్నది. ఒక్క సోవియట్ యూనియన్లోనే 27 మిలియన్లు, జర్మనీ 5.3 మిలియన్లు, చైనా 7.5 మిలియన్ల ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. వరల్డ్ వార్-2లో సహితం దాదాపు 87,000 మంది సైనికులు, లక్షకు పైగా సామాన్య జనం ప్రాణత్యాగం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం..ప్రజలపై ప్రభావం
01 సెప్టెంబర్ 1939న హిట్లర్ నాజీ జర్మనీ సేనలు పోలాండ్‌పై దండయాత్ర చేయడంతో రెండో ప్రపంచ యుద్ధానికి బీజాలు పడ్డాయి. ఈ దాడిని ఖండించిన యుకె, ఫ్రాన్స్ దేశాలు 03 సెప్టెంబర్‌న జర్మనీపై యుద్ధం ప్రకటించడంతో భీకర ప్రపంచ యుద్ధం విధ్వంసక జడలు విప్పడం, ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోవడంతో యుద్ధ తీవ్రత మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడంతో జర్మనీ దురాక్రమణ చేసిన భూమిని వదిలేయడం, 08 మే 1945న బేషరతుగా జర్మనీ ఓటమిని అంగీకరించడం జరిగింది. ఓటమిని అంగీకరిం చని జపాన్‌లోని హిరోషిమా 06 ఆగష్టు 1945), నాగసాకి (09 ఆగష్టు 1945) నగరాలపై రెండు అణు బాంబులు వేయడంతో జపాన్ ఓటమిని అంగీకరించడం(15 ఆగష్టు)తో రెండో ప్రపంచ యుద్ధం 02 సెప్టెంబర్ 1945న ముగిసినట్లు ప్రకటన వెలువడింది. ప్రపంచ యుద్ధం-2 నేర్పిన గుణపాఠాన్ని గమనించిన ఐరాస సత్వరమే చొరవ తీసుకుంది. ఇలాంటి యుద్ధాలు మానవాళికి శాపాలుగా మారుతాయని అంగీకరించి, ప్రపంచ యుద్ధాలను నిరోధించడంలో భాగంగా నాటి అగ్రరాజ్యాలైన యుఎస్, రష్యా, యుకె, ఫ్రాన్స్, చైనా సభ్యుల శాశ్వత సభ్యత్వంతో కూడిన ‘ఐరాస భద్రతా మండలి’ ఏర్పడింది. అనంతర అర్థ శతాబ్దకాలం పాటు అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన విషయం కూడా విదితమే.
మూడో ప్రపంచ యుద్ధం రానుందా?
ఓ వైపు 24 ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, మరో వైపు 07 అక్టోబర్ 2023 నుంచి ఇజ్రాయిల్‌తో పాలస్తీనా యుద్ధంతో పాటు లెబనాన్/ఇరాన్‌లు కూడా ఇజ్రాయిల్‌పై దాడులకు ఉపక్రమించడం తీవ్ర రూపం దాల్చుతూ నెలలు, సంవత్సరాలు దాటుతూ మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తున్నది. గతంలో జరిగిన ఇలాంటి రక్తపాత యుద్ధాలతో పాటు నేటి యుద్ధాలు కూడా ప్రపంచ మానవాళికి అద్వితీయ గుణపాఠాలను నేర్పుతున్నాయి. యుద్ధాలు ఎవరు గెలిచినా మారణహోమం, మానవ వనరుల విధ్వంసం తప్పనిసరి అవుతున్నది. రెండు ప్రపంచ యుద్ధాలు పరిచయం చేసిన లక్షలాది మరణాల నుంచి మనందరిలో ఆత్మ విమర్శలకు దారులు తెరవాలి. శతాబ్దం దాటిన ప్రపంచ యుద్ధం-1, 75 ఏండ్ల దాటిన 2వ ప్రపంచ యుద్ధ క్షేత్రాల్లో కోట్ల ప్రాణాలు గాల్లో కలవడం, అపార ఆస్తినష్టం సంభవించడం మనకు హెచ్చరిక కావాలి. 3వ ప్రపంచ యుద్ధమే జరిగితే అత్యాధునిక ఆయుధాలు, అణుబాంబు విధ్వంసాలతో భూమి క్షణాల్లో బూడిద కావడం ఖాయమని తెలుసు కోవాలి. ఓడిన వారు సర్వస్వాన్ని, గెలిచిన వారు భవిష్యత్తు తరాలను కోల్పోతారు. అమెరికా-ఉత్తర కొరియా, ఇం డియా-పాక్, చైనా-తైవాన్‌ల మధ్య అనాదిగా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే వీటన్నింటికి ఆజ్యం పోసేది మాత్రం అమెరికా అన్న సంగతి మన గమనంలో ఉండాలి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే శక్తివంతమైన క్షిపణులు (మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్), అణ్వాయుధాల అమ్ముల పొదలు భూగోళం దద్దరిల్లేలా గర్జనలు చేసి మానవాళికి ఎంతో నష్టం చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే 67 దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధ వాతావరణం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.దీన్ని అరికట్టే దిశగా ప్రపంచ దేశాలు పూనుకోవాలి. పరస్పరం చర్చల ద్వారా అంగీకరానికి రావాలి. ప్రజల్ని కాపాడుకోవాలి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం
నేడు ఏ రెండు అతి చిన్న దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనా, మరో ప్రపంచ యుద్ధానికి కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం 24 ఫిబ్రవరి 2022న ప్రారంభమై నేటికీ కొనసాగుతున్నది. గత 19 నెలలుగా అపార నష్టాలకు కారణమవుతున్నది. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన ఐదు లక్షల మంది మరణించడం లేదా గాయపడినట్టు ప్రపంచ మీడియా ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికేఉక్రెయిన్‌కు వెన్నుదన్నుగా ఉంటున్న అమెరికా రష్యాను దెబ్బతీసేందుకు నాటోను ప్రవేశపెట్టడం వ్యూహాత్మకంలో ఓ భాగమే. అయితే అమెరికా సహకారంతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఇది అపారష్టం కలగజేస్తున్నది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి చర్చలకు చైనా సహకరిస్తున్నది. కానీ ఇది కూడా సహించని అమెరికా ఇరు దేశాలపైనా తన వాణిజ్య ఆంక్షలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ప్రపంచంలో నెంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్తున్న చైనాను ఎలాగైనా అణగదొక్కాలనే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఇప్పటికే తమ దేశంలో తయారు చేసే ఆయుధ, యుద్ధ సామాగ్రిని ఇతర దేశాలకు అందించడం, సంఘీభావాన్ని వ్యక్తం చేయడం, తమకు లంగని దేశాలపై యుద్ధం ప్రకటించడం అమెరికా కుతంత్రాలను బట్టబయలు చేస్తోంది.
పాలస్తీనా-ఇజ్రాయిల్ యుద్ధం
పాలస్తీనా దేశంలోకి వలసెళ్లిన యూదులు అక్కడి అరబ్బులను తరిమికొట్టి దేశాన్ని ఆక్రమించిన తీరు జగమెరిగిన సత్యం. ఇజ్రాయిల్‌ను కూడా వెనుకనుండి నడిపిస్తున్నది అమెరికానే. అయితే ఈ యుద్ధంలో గాజాపై జరిగిన బాంబులు, రాకెట్ల వర్షం ఎంతోమంది పసిపిల్లలతో సహా దాదాపు నలభై వేల మందికిపైగా ఇప్పటివరకు హతమార్చింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ రక్తహింస ప్రపంచ చరిత్రలోనే ఒక దారుణ మారణహోమం. దీనికి యథేచ్ఛగా సహకరిస్తున్న అమెరికా కూడా ప్రపంచ న్యాయస్థానంలో ముద్దాయే. పాలస్తీనా పౌరులను రక్షించడం కోసం ఏర్పడిన హమాస్ సంస్థను నిర్మూలించే పేరుతో కొనసాగుతున్న ఈ యుద్ధ బీభత్స లక్ష్యం పాలస్తీనాను పూర్తిగా ఆక్రమించడం.దాన్ని తిప్పికొడుతున్న పాలస్తీనా ప్రజల ధైర్య సాహసాలు అభినందించదగినవే. అయితే అన్ని దేశాల్లో యుద్ధాలకు కారణమవుతున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని ముందు బద్ధలు కొట్టాలి. అది శాంతియుత ఉద్యమాల ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తెరగాలి.
యుద్ధం ప్రమాదకరమని, యుద్ధాలతో సమాధానాలు దొరకవని, శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని నమ్మితేనే అది సత్ఫలితాల నిస్తుంది. ఒకవేళ యుద్ధానికే కాలుదువ్వితే ఇరుపక్షాల వైపు ప్రపంచ దేశాలు చేరి మరో ప్రపంచ యుద్ధ వాతావరణం నెలకొనడం, మానవాళి/సకల ప్రాణి కోటి మనుగడ ప్రశ్నా ర్థకంగా మారుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బాధ్యత గల ప్రపంచ దేశాలు శాంతి పావురాలను ఎగురవేస్తూ, సర్వమానవాళి సంక్షేమ దిశగా అడుగులు వేయాలి. అమెరికా ఏకఛత్రాధిపత్యాన్ని, దేశాలపై పెత్తనాన్ని ఐక్యరాజ్య సమతి కట్టడి చేయాలి.లేదంటే సామ్రాజ్యవాద అరాచకం మరింత మితిమీరి ప్రపంచ దేశాలపై ప్రభావం చూపే అవకాశమున్నది.
(01 సెప్టెంబర్ ”ప్రపంచ యుద్ధం-2 ప్రారంభ దినం”,
02 సెప్టెంబర్ ‘ప్రపంచ యుద్ధం-2 ముగిసిన దినం’)
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037