– ఆమోద ముద్ర వేసిన చైనా
బీజింగ్ : ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి చైనా ఆమోద ముద్ర వేసింది. టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో వుంది. దీంతో పరీవాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌ల్లో ఆందోళనలు నెలకొన్నాయి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్ జంగ్బోగా పిలుస్తారు. ఆ నదీ దిగువ ప్రాంతంలో పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్‌గా భావించే త్రీ గోర్జెస్ డ్యామ్‌కు ఇది దాదాపు మూడు రెట్లు పెద్దదిగా వుంటుంది. ఏడాదికి 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని సంబంధిత నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టుతో టిబెట్‌కు ఏటా 20బిలియన్ల యువాన్ల ఆదాయం లభిస్తుంది. అత్యంత నాణ్యతతో కూడిన అభివృద్ధి పంథాను అనుసరించేందుకు దేశం చేస్తున్న కృషిని మరింత వేగవంతం చేయడంలో ఈ ప్రాజెక్టు సానుకూల పాత్ర పోషిస్తుందని చైనా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.