ప్రధాన రోడ్లపై.. ప్రమాదపు చింత

 Adilabad– రహదారిపైన అడ్డంగా నిలుస్తున్న పశువులు
– ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
– తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-చింతలమానేపల్లి
మండలంలో మూగజీవాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిష్టవేసి అడ్డంకులు కల్పిస్తున్నాయి. పశువులు రహదరిపై నిద్రిస్తుండటంతో పాటు గంటల కొద్ది స్థిరంగా నిలిచి ఉండటం, రాకపోకలు సాగించకుండా అడ్డంగా ఉండటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి సంరక్షణపై యజమానులకు ఎలాంటి శ్రద్ద లేకుండా పోయింది. చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆడేపెల్లి, డబ్బా ఎక్స్‌ రోడ్‌, దింద, గూడెం, బూరెపల్లి, రంన్‌వెల్లి, గంగాపూర్‌, రుద్రాపూర్‌ తదితర గ్రామాల్లో మూగజీవాల సంతతి అధికంగా ఉంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పందులు తదితర రకాల మూగజీవాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం గ్రామాల్లోని పంట పొలాల్లో పంటలు సాగు కాకపోవడంతో రైతులు పశువుల సంరక్షణ పట్టించుకోవడం లేదు. ఏటేటా ఉత్పన్నమవుతున్న వర్షాబావ పరిస్థితులతో రెండు, మూడేండ్ల నుంచి వ్యవసాయం అంతంత మాత్రంగానే సాగవుతోంది. దీంతో అన్నదాతల్లో నైరాశ్యం నెలకొని పంటల సాగులో తనతో పాటు పాలుపంచుకునే పశువులను గాలికి వదిలేస్తున్నారు. దీంతో మూగజీవాలు రహదార్లపై గుంపులు గుంపులుగా ఉంటున్నాయి. మేకలు, గొర్రెలు, గేదెల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇక పందులు, కుక్కల సంగతి వేరే చెప్పనవసరం లేదు.
రాకపోకలకు ఆటంకాలు..
రహదారులపై వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. పశువులను కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల చాలా మట్టుకు రాత్రిపూట పశువులు రహదారులపై నిద్రిస్తున్నాయి. పశువులు పగటి పూట గుంపులు, గుంపులుగా రహదారుల వెంట తిరుగుతున్నాయి. మూగజీవాలు రోడ్లపైకి రావడంతో నిత్యకృత్యంగా రాకపోకలు సాగించే వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాచోదకులు చీకట్లో మూగజీవాలను ఢకొీట్టుతున్నారు. గతంలో కర్జెల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై కంకర టిప్పర్‌ ఢ కొట్టటంతో పశువు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. కార్జెల్లి, గూడెం, రవీంద్ర నగర్‌-1, రవీంద్ర నగర్‌-2, కార్జెల్లి, గూడెం నుండి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారులపై మూగజీవాల సంచారం అధికంగా ఉంటోంది. అదేపల్లి ప్రాంతంలో పశువులు వాహనాలకు మొబైల్‌ స్పీడ్‌ బ్రేకర్లుగా తయారయ్యాయి.
పట్టించుకోని అధికారులు…
రహదారులపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్న మూగజీవాలను నియంత్రించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనచోదకులు, ప్రజలు వీటి వల్ల ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు శ్రద్ధపెట్టడం లేదు. వాస్తవానికి ఆడ్డూ, అదుపు లేకుండా తిరుగుతున్న ఆవులు, గేదెలు, ఎద్దుల యాజమానులకు నోటీసులు జారీచేసి ఆపరాధ రుసుం వసూలు చేయాల్సి ఉంటుంది. అయిన సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.