– కృష్ణ, బీమా నదుల ప్రవేశం దగ్గరే నీటి కోసం అవస్థలు
– ఎగువ ప్రాంతం పేరుతో పనులు జరగని మిషన్ భగీరథ
– తంగెడు, సుకూర్ లింగంపల్లి గ్రామాల దగ్గర కృష్ణా నీరు జిల్లాలోకి ప్రవేశం
– అయినా తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావులే దిక్కు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న నదీ సమీప ప్రజలు
చుట్టూ జీవనదులు ప్రవహిస్తున్నా.. గొంతు తడుపుకోవడానికి కూడా అల్లాడాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.. సుదూర ప్రాంతాలలో పట్టణాలకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్న కృష్ణానది.. దాని పక్కనే ఉంటున్న వేలాది మంది ప్రజల గొంతు మాత్రం తడపడం లేదు. కృష్ణానది ఎగువ ప్రాంతం అయిన కర్నాటక, మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో సరిపడా నీళ్లు ఉన్నా.. దిగువ ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం కటకట ఆడాల్సిందే. వేల కోట్లు ఖర్చు చేసి తాగునీటి అవసరాలు తీర్చామని గత ప్రభుత్వం ఆర్బాటం చేసినప్పటికీ కూతవేటు దూరంలో ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీరు అందివ్వలేకపోయిందన్న విమర్శ మూటగట్టుకుంది.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలో తంగెడు గ్రామం సంగమం దగ్గర కృష్ణానది జిల్లాలో ప్రవేశిస్తుంది. అదే గ్రామంలో సుకూర్, లింగంపల్లి దగ్గర బీమా నది వచ్చి కృష్ణానదిలో చేరుతోంది. రెండు ప్రధాన నదులున్నా.. వేసవి వచ్చిందంటే ఇక్కడ తాగునీటికి ఘోస తప్పడం లేదు. గత పాలకులు మిషన్‌భగీరథ పథకం పేరుతో వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ఎగువ ప్రాంతంలో ఉండటం వల్ల మోటార్లు ఎత్తుకు నీటిని అందివ్వలేవన్న కారణం చూపి మిషన్ భగీరథ పథకం ఇక్కడ అమలు కాలేదు. తాగునీటి సమస్య తీర్చడానికి ఈ ప్రాంతంలో లిప్టులు ఏర్పాటు చేశారు. తంగెడి లిప్టు, స్వయం భూలక్ష్మి వెంకటేశ్వర లిప్టు పేరుతో రెండు లిప్టులు, ముడిమాల్ లిప్టు, క్షీర లింగేశ్వర లిప్టులను ఏర్పాటు చేశారు. ఈ లిప్టుల ద్వారా వరదలు వచ్చే సమయంలోనే తాగునీటి సరఫరా చేస్తారు. వేసవిలో వరదలు ఆగి జలాలు వెనక్కి వెళ్లిపోతే.. ఇక్కడ చుక్క నీటి నిల్వ ఉండదు. శుకూర్‌లింగంపల్లి, అయినాపూర్, కూసుమర్తి, తంగెడి, కృష్ణ, ఇందూపూర్, ముడిమాల్, గుడెబల్లూరు గ్రామాల్లో వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
బోరుబావులు, వ్యవసాయ బోర్లే ఆధారం..
కృష్ణ మండల పరిధిలో 40 వేల జనాభా ఉంటుంది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే వీరికి సాగునీరు లేదు.. తాగునీటికి సైతం కష్టంగా ఉంటుంది. భూగర్భ జలాలు పడిపోయి బోరు బావులు ఎండిపోతే తాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారింది. రిజర్వాయర్లు లేకపోవడంతో సాగు భూములకు నీరు అందడం లేదు. తాగునీటి అవసరాల కోసమైనా రిజర్వాయరు ఏర్పాటు చేస్తే.. వేసవిలో తాగునీటి సమస్య తీరనుంది. కొండల మీద ఉన్న గ్రామాలకు తాగుసాగు నీరు ఇచ్చే టెక్నాలజీ ఉన్న కాలంలోనూ ఈ ప్రాంత ప్రజల సమస్య తీరడం లేదు.
ఎగువ ప్రాజెక్టుల వల్లే నీటి సమస్య
కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణానది ఎగువన చెక్‌డ్యాంలు, బ్రిడ్జీలు కం బ్యారేజీల నిర్మాణం చేశాయి. వేసవి కాలంలో ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేసుకుంటున్నాయి. అందుకే వేసవిలో మనకు నీటి సమస్య ఏర్పడుతోంది. మనకు కూడా నీటి సమస్య రాకుండా ఉండాలంటే ఇక్కడ రిజర్వాయర్‌లు నిర్మాణం చేసుకోవాలి. వరదలు వచ్చినప్పుడు నిల్వ చేసుకుంటే నీటి సమస్య తీరుతుంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేయాల్సి ఉంది.
తాగునీటి కోసం తండ్లాడుతున్నాం.
కున్సి వెంకటేష్, తంగెడి గ్రామం నారాయణపేట జిల్లా
మా భూములు వరదలు వస్తే మునుగుతాయి. కానీ ఎండాకాలం వస్తే తాగునీరు కూడా దొరకదు. కృష్ణా, బీమా నదులు రెండు కిలోమీటర్ల దూరాన ఉన్నా.. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వేసవిలో బోరుబావులు, ట్యాంకర్ల నీటినే వాడాల్సి వస్తోంది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలి.
మిషన్ భగీరథ నీటిని ఎందుకు సరఫరా చేయడం లేదు
వెంకట్‌రాంరెడ్డి గవినోళ్ల, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నదికి రెండు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న నగరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న కృష్ణ మండలంలో తాగునీటి సమస్య తీర్చడం లేదు. గత పాలకులు మిషన్‌భగీరథ పేరుతో హడావుడి చేసి అధికారంలోకి వచ్చారు. చిత్తశుద్ది ఉంటే తాగునీటి సమస్య పరిష్కారం కష్టమేమీకాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తాగునీటిపై చర్యలు తీసుకోవాలి.
నీటి కొరత ఉంది.. సమస్య రాకుండా చూస్తున్నాం
ఎంపీడీఏ జానయ్య
కృష్ణ మండలంలో తాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమే. ఈ ప్రాంతం ఎత్తున ఉండటంతో ఇక్కడికి మిషన్‌భగీరథ నీళ్లు రావడం లేదు. అయినా బోరు బావులు, వ్యవసాయ పంపు సెట్ల ద్వారా నీటిని అందజేస్తున్నాం. ఇక్కడ ఒక రిజర్వాయరు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ప్రజలకు నీటి కొరత రాకుండా ప్రయత్నం చేస్తున్నాం.