– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-దమ్మపేట
అమలు కాని 420 వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమాలిన నిర్ణయాలతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వర్షాకాలం వస్తున్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా పై స్పష్టమైన ప్రకటన కాంగ్రెస్ చేయలేదన్నారు. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికి దేవుళ్లపై ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకో నిర్ణయం ప్రకటిస్టు రుణమాఫీ ప్రక్రియను అమలు చేయడానికి నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. అనేక షరతులు విధిస్తూ రోజుకో ప్రకటన చేయడం వల్ల అన్నదాతల్లో ఆందోళన ఎక్కువైందని అన్నారు.
ఎటువంటి షరతులు లేకుండా రుణాలు పొందిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలని అదే విధంగా కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. డీఎస్సీ వాయిదా కోసం నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తూ ఉంటే వాళ్లు తాలిబాన్ తీవ్రవాదులైనట్టు అక్రమ అరెస్టులు చేస్తూ యువతను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాక తప్పదని వారు అనుసరించే విధానమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఎక్కడ పేరు వస్తుందో అని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కౌలు రైతులకు ఎటువంటి కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.