– ఇంకా చాలాచోట్ల సిద్ధం కాని నారుమళ్లు
– రాష్ట్రవ్యాప్తంగా 50 శాతమే సాగు
– ఉత్తర తెలంగాణలో వరదలొచ్చినా నిరాశే
– దక్షిణ తెలంగాణలో ఆశించిన వర్షాల్లేవ్..జలాశయాలలోకి రాని వరద
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల చూపు
నవ తెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
న్ మొదటి వారంలో వేయాల్సిన వరి నారుమల్లు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మొదలు కాలేదు. వర్షాలు ఆలస్యంగా రావడం రిజర్వాయర్లలోకి ఆశించిన నీళ్లు రాకపోవడం వల్ల వరి సాగుకు గడ్డు కాలం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతమే వరి సాగైనట్టు అధికారిక సమాచారం. ఉత్తర తెలంగాణలో వర్షాలొచ్చి.. వరదలొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. సీజన్ దాటిపోయిన తర్వాత వర్షాలు వచ్చాయి. దక్షిణ తెలంగాణలో ఆశించిన వర్షాల్లేక జలాశయాలలోకి నీరు చేయలేదు. దీంతో రైతులు నిరాశతో ఉన్నారు. వరికి 60 రోజులు ఆలస్యం కావడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆలస్యంగా వరిసాగు చేస్తే దిగుబడి మీద ప్రభావం పడటం, చీడ పీడల బాధ అధికంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబు తున్నారు. ముఖ్యంగా సోనామసూరిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హంస పంట సాగు చేయడం లాభదా యకం కాదు అని అధి కారులు అంటున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు ప్రత్యా మ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచనలు ఇస్తున్నారు. అదును దాటి సాగు చేసినా పూర్తిస్థాయిలో పంటలు చేతికొచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆయా ప్రాంతాలలో పెసర మినుము కంది మొక్కజొన్న వంటి పంటల వైపు రైతులు దృష్టి సారించారు.
రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో మొత్తం వరి సాగు 49,86,634 ఎకరాలకు గాను 25 లక్షల ఎకరాలలో సాగైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి తర్వాత అత్యధికంగా సాగయ్యేది వరి. అధికారిక లెక్కల ప్రకారం సాధారణంగా 7 లక్షల ఎక రాలలో వరి సాగయ్యే అవకా శాలున్నా ..తక్కువగానే సాగైంది. వానా కాలంలో ఎక్కువ శాతం సోనా మసూరి, బీపీటీ పంటను సాగు చేస్తారు. అయితే ఈసారి వర్షాలు ఆలస్యం కావడం ఇప్పటికీ పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు నిండకపోవడం వల్ల వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
జూన్ మొదటి వారంలో రావలసిన వర్షాలు జూలై చివరలో వచ్చాయి. పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు నిండలేదు.
జూరాల సామర్థ్యం 9.58 టీఎంసీలు కాగా 7.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ లో 885 పీట్లకు గాను 857 ఫీట్ల నీటి నిల్వ ఉంది 206టీఎంసీ లకు గాను 99.12 సీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. వర్షాలు తగ్గడంతో ఎగువ ప్రాంతం నుంచి వరదలు రావడం లేదు. దీంతో రిజర్వాయర్లు పాక్షికంగానే నిండాయి.
వరి రైతులకు భరోసా కల్పించాలి
వర్షాలు లేక వరదలు రాక వరి సాగు ఆలస్యమైంది. సాగు ఎలా జరిగినా దిగుబడి పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మార్కెట్ ద్వారా వరి కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించాలి. వరి సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పించి దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చిరుధాన్యాలు ఆహార పంటలు కూరగాయల సాగుపై దృష్టి సారించాలి. తెలంగాణ వ్యాప్తంగా 50 శాతం మాత్రమే ఇప్పటికీ వరి సాగు అయినట్టు తెలుస్తుంది. ఇలా అయితే వరి ధాన్యం కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– టి.సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రిజర్వాయర్లు నిండక పోవడమే కారణం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రిజ ర్వాయర్లు నిండకపోవడం వల్ల వరి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆలస్యంగా నీళ్లు వస్తే వరి నాటు కుందామనుకున్న రైతులకు నిరాశ మిగిలింది. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు బీమా, నెట్టెంపాడు కోయిల్ సాగర్‌లకు లిప్తుల ద్వారా నీళ్లు రావడం లేదు. పూర్తిస్థాయిలో రిజర్వాయర్లు నిండకపోవడం వల్ల లిఫ్టులు ప్రారంభించలేదు. వనపర్తిలోని సప్తసముద్రాలు, నాగర్‌కర్నూల్‌లోని కేసరి సముద్రం, నాగనూలు, నాగసముద్రం పూర్తిస్థాయిలో నిండలేదు. ప్రధాన రిజర్వాయర్ల కింద ఆయకట్టు వెలవెలబోతుంది.
ప్రత్యామ్నాయ సాగుకు అధికారులు సహకరించాలి
వర్షాలు లేకపోవడం, వరదలు రాకపోవడంతో వరి సాగు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా రిజర్వాయర్ల కింద ఆయకట్టు వెలవెలబోతుంది. నారు మల్లు వేయడం ఆలస్యం కావడంతో వరి పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్లిష్టతర సమయంలో వరిసాగు కు ప్రత్యామ్నాయంగా ఆహార పంటలు చిరుధాన్యాలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి.
– కడియాల మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్
వరికి సీజన్ దాటిపోయింది
వరికి సీజన్ దాటిపోయింది. ఇప్పుడు నారుమల్లు వేస్తే లాభదాయకమైన దిగుబడి రాదు. అందుకే డ్రం ఫీడర్ తప్పనిసరిగా వాడాలి. ముఖ్యంగా మెట్ట లో వరి ధాన్యాన్ని చల్లడం ద్వారా దాటిపోయిన సమయాన్ని అధిగమించవచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడిపై ప్రభావం ఉండదు. మరీ ముఖ్యంగా మెట్ట పొలాల్లో వరి ధాన్యంతో పాటు చిరుధాన్యాలు వ్యాపార పంటలు సాగు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దిశగా రైతులు వ్యవసాయం చేసుకొని నష్టాల నుండి దూరంగా ఉండాలి. నాగర్ కర్నూల్ జిల్లాలో సాధారణంగా 1,20,000 ఎకరాలలో వరి పంట సాగు కావలసి ఉంది. అయితే ఇప్పటివరకు 5000 ఎకరాలు మాత్రమే సాగయింది. మరో 20 రోజుల్లో 30 శాతం సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.
– వెంకటేశ్వర్లు డీఏఓ నాగర్ కర్నూల్ జిల్లా