– ప్రజల్లో పొదుపు తగ్గి, అప్పులు పెరగడంపై ఆర్థికవేత్తలు
– ప్రభుత్వం విదేశీ రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది
– అసమానతలు పెరుగుతాయి
– ద్రవ్యలోటు అదుపు తప్పుతుంది
న్యూఢిల్లీ : దేశంలో కుటుంబ పొదుపు తగ్గడం, అదే సమయంలో రుణభారం పెరగడంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022-23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబ నికర పొదుపు గడచిన దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా 5.1శాతంకు పడిపోయింది. అదే సమయంలో కుటుంబ రుణభారం జీడీపీలో 5.8% పెరిగింది. 2021-22లో ఈ రుణభారం పెరుగుదల 3.8శాతం మాత్రమే.
కుటుంబ పొదుపు తగ్గిపోతుండడంపై ఆర్థికవేత్తలు ఆందోళన పడుతుంటే aఅందులో అర్థమే లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ కొట్టిపారేస్తోంది. నివాస గృహాలు, వాహనాల కొనుగోలు కోసమే ప్రజలు అప్పులు చేస్తున్నారని, అందుకే పొదుపు తగ్గుతోందని, ఇది అందోళనకు కాకుండా ఆత్మ విశ్వాసానికి సూచిక అని చెబుతోంది. దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే కుటుంబ, ప్రభుత్వ, కార్పొరేట్ వ్యాపార రంగాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కుటుంబ రంగానికి సంబంధించి ప్రజలు స్వాభావికంగా తాము అప్పు చేసే మొత్తం కంటే పొదుపు చేసే మొత్తమే ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. పొదుపు చేసే సొమ్ముతో పెట్టుబడులు పెడతారు. ఇతరులకు అప్పులు ఇస్తారు. భవిష్యత్ అవసరాల కోసం మూలధనాన్ని సమకూర్చుకుంటారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ, కార్పొరేట్ వ్యాపార రంగాలు తమ కార్యకలాపాలలో పెట్టుబడుల కోసం అప్పులు చేస్తుంటాయి. దీనివల్ల ద్రవ్య లోటు ఏర్పడుతుంది.
ప్రజల పొదుపే ప్రభుత్వానికి ఆధారం
ప్రజల్లో పొదుపు తగ్గి, అప్పులు పెరగడంపై ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ ఛైర్మన్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్, మద్రాస్ స్కూల్‌్ ఆఫ్ ఎకనమిక్స్ మాజీ డైరెక్టర్, గౌరవ ప్రొఫెసర్ డీకే శ్రీవాత్సవ ఏమంటున్నారంటే…అప్పులు పెరగడం వల్లనే ఆస్తుల నికర విలువ తగ్గిపోతుంది. అప్పులు ఎందుకు పెరుగుతాయన్న దానికి అనేక కారణాలు చెబుతుంటారు. ప్రజల్లో స్థిరత్వం తక్కువ. వారు చంచల స్వభావులు. అందుకే ఎక్కువగా అప్పులు చేస్తుంటారు. దాని ఫలితంగా వారి నికర పొదుపు తగ్గిపోతోంది. ఇక్కడ కుటుంబ ఆస్తులు అంటే బ్యాంక్ డిపాజిట్లు, నగదు, ఈక్విటీ పెట్టుబడులు. అప్పులు చెల్లించిన తర్వాత, కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినవే ఆస్తులు. వీటి పైనే భారత ప్రభుత్వం ఆధారపడుతుంది. మౌలిక సదుపాయాలు, యంత్రాలు, పరికరాలు వంటి భౌతిక ఆస్తుల మూలధనపు పెట్టుబడిగా ప్రజల ఆస్తులను ఉపయోగించుకుంటుంది.
ఎంత వరకు ఉండవచ్చు ?
ప్రజలు తక్కువ మొత్తంలో పొదుపు చేస్తే ఆర్థిక వ్యవస్థకు సమస్యలు ఎదురవుతాయి. జీడీపీలో ప్రజల పొదుపు 7శాతం, విదేశాల నుంచి లభించే వనరులు 2.5%, కేంద్ర రాష్ట్రాల ద్రవ్య లోటు కలిపి 6శాతం వరకూ ఉంటే వాటిని ఆమోదయోగ్యమైన స్థాయిలుగా పరిగణిస్తారు. జీడీపీలో అప్పులు 9.5శాతం ఉండవచ్చు. దీనిలో ప్రభుత్వ అప్పులు 6శాతం, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు 1-1.5శాతం, ప్రయివేటు కార్పొరేట్ రంగం అప్పులు 2-2.5శాతం ఉండవచ్చు. అయితే ప్రజల పొదుపు రేటు శాశ్వతంగా 5శాతంకు పడిపోతే అది 6శాతంగా ఉండాలన్న నిబంధనను పాటించడం సాధ్యం కాదు. ఈ పరిస్థితి బడ్జెట్లపై ఒత్తిడి పెంచుతుంది. దీనిని నివారించాలంటే ద్రవ్యలోటును తగ్గించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
యాక్సిస్ బ్యాంక్ ఆర్థికవేత్త సౌగత భట్టాచార్య కూడా కుటుంబ పొదుపు వేగం పుంజుకోకపోవడం ఆందోళనకరమేనని చెప్పారు. దేశీయ పొదుపు సరిగా లేకపోతే విదేశీ పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని, ఇది అస్థిరతకు దారి తీస్తుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.1శాతం జీడీపీ వృద్ధి సాధించాలంటే ప్రభుత్వం పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సి ఉంటుంది. అంతే తప్ప కేవలం ప్రైవేటు వినియోగంపై ఆధారపడడం సబబు కాదు. ఆస్తులు తగ్గి, అప్పులు పెరగడం అసమానతలకు దారితీస్తుంది. ప్రజలు అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నారని ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆర్థికవేత్త రూపా రేగే నిత్యూర్ వ్యాఖ్యానించారు. దీనివల్ల ఆదాయాల్లో పెరుగుదల ఉండదని, అదే సమయంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని చెప్పారు.
ఆందోళనకరమే
1:45 am