అధ్వానంగా హేటిగూడ ప్రధాన రహదారి

Navatelangana,Adilabad,Telugu News,Telangana,– డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్డుపైకి
– కొద్దిపాటి వర్షానికే బురదమయం
– అవస్థలు పడుతున్న విద్యార్థులు, స్థానికులు
నవతెలంగాణ-చింతలమానేపల్లి
మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హేటిగూడ నూతన గ్రామపంచాయతీ సమస్యల వళయంలో ఉంది. గ్రామంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లు గుంతలు పడి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. అంతేకాక డ్రైనేజీలు లేక మురుగు నీరంతా రోడ్డుపైకి వచ్చి చేరుతుండడంతో దుర్గందం వెదజల్లుతోంది. రుద్రాపూర్‌, హేటిగూడ గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, వంతెన అప్రోచ్‌ రోడ్డు సరిగా లేక ఎడ్ల బడ్లు మంతెన ఎక్కలేక, ద్విచక్ర వాహనాలు కూడా కిందపడ్డ పలు సందర్భాలున్నాయయి. గుంతల్లో నీరు నిలవడంతో రాకపోకలు సాగించే సమయాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులకు తమ సమస్యలు గుర్తుకొస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.
చూట్టు తిరిగి వెళ్లాల్సిందే..
హేటిగూడ నుండి కుంటలమానేపల్లి, తుమ్మలగూడ, రెబ్బెన గ్రామాలకు ఆయా గ్రామ ప్రజలు తరచూ రాకపోకలు సాగించేందుకు ఇదే ప్రధాన లింకు రోడ్డు. కుంటలమానేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఉన్నందున పాఠశాల సెలవు రోజులలో విద్యార్థులు ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. హేటిగూడ, కుంటలమానేపల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన లేక వర్షాకాలంలో వాగు దాటలేని పరిస్థితి. ఆ గ్రామాలకు బంధాలు తెగిపోయి. రైతులు పొలాలలో వెళ్లాలంటే చుట్టూ తిరిగి ఎనిమిది, పది కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రుద్రాపూర్‌, హేటిగూడ వంతెనకు అప్రోచ్‌ రోడ్డు ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, వర్షాలు పడితే దారుణంగా తయారవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇక ముసురు పెడితే రోడ్డులో ఎక్కడ గుంత ఉందనేది తెలియదని, దీంతో అనేకమంది ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని. గతంలో అనేక మంది వాహనదారులు పల్టీలు కూడా కొట్టి గాయపడిన ఘటనలు ఉన్నాయని చెబుతున్నారు.
విద్యార్థుల అవస్థలు
హేటిగూడ ప్రధాన రహదారి ద్వారానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాల రోడ్డు గుంతలు పడ్డాయి. చినుకు పడినప్పుడల్లా.. నీరు నిలిచి వరి మడులను తలపిస్తోంది. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్ధులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా బాధలను గుర్తించి గుంతల రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.
గుంతలు, మురుగుతో సమస్య..
గుర్లె అజయ్ హేటిగూడ
రోడ్డుపై గుంతలతో పాటు డ్రెయిన్లు సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు కూడా రోడ్డుపైకి పారుతోంది. దీంతో గుంతల్లో ఆ మురుగు నీరంతా చేరి రాకపోకలు సాగించే సమయాన నరకంగా ఉంటుంది. రాత్రి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు దృష్టిసారించి సమస్యకు పరిష్కారం చూపాలి.