– పొట్టకూటి కోసం పని చేస్తున్న ఓ కార్మికురాలి పై యాజమాన్యం జులుం..
– అనారోగ్యంతో సెలవు పెట్టినందుకు షాపింగ్ కి రానివకుండ రోజుల తరబడి చుట్టు తిప్పుకుంటున్న వైనం..
– న్యాయం చేయలేక చేతులు ఎత్తి వేసిన అనుబంధ కార్మిక సంఘ నాయకులు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్.
అదొక పెద్ద వస్త్ర ప్రపంచం.బహుశా అందులో షాపింగ్ చేయాలంటే సామాన్యుల వల్ల కాదనేది ప్రజల్లో నెలకొన్ననానుడి.అక్కడ ఉన్న ధరలకు ఉన్నత స్థాయి కుటుంబ వ్యక్తులు మాత్రమే ఆ షాపింగ్ మాల్ కి వెళ్తుంటే సామాన్యులు ఆ షాపింగ్ మాల్ లో కేవలం పని చేయడానికి మాత్రమే ఉన్నారనేది ఆ షాపింగ్ యాజమాన్యం మనస్సులో ఉండి ఉంటుందనేది ఆ షాపులో పనిచేసే ఓ కార్మికురాలికి మిగిలిన ఆవేదనే నేడు ఉదాహరణగా నిలిచిందని అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఆది వారం రాత్రి అట్టి షాపింగ్ మాల్ వద్ద బాధితులు చెప్పిన పూర్వపరాలు ఇలా ఉన్నాయి.జిల్లా కేంద్రంలోని సూర్యాపేట-విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న వసుందర షాపింగ్ మాల్ ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు శ్రీకాకుల హైమావతి భర్త శ్రీనివాస్ అనే మహిళ పని చేస్తోంది.ప్రస్తుతం ఆమె జీతం నెలకు రూ.11,500 మాత్రమే.కాగా ఆ షాపులో ప్రతి రోజు ఉదయం 10 నుండి రాత్రి 9:30 గంటల వరకు ఆమె పని చేస్తున్న క్రమంలో అనుకోకుండా ఆమె భర్త శ్రీనివాస్ కి నరాల బలహీనత(పెరాలసిస్)వ్యాధి రావడంతో ఆమె షాపు సూపర్ వైజర్ల అనుమతితోనే సుమారు 20 రోజుల పాటు సెలవు పెట్టింది. అనంతరం క్రమంగా ఆమె భర్త కోలుకోవడంతో ఈనెల 9న తిరిగి ఉద్యోగంలో చేరడానికి వెళ్లగా మాల్ సూపర్ వైజర్లు ప్రకాష్,తిరుపతిలు నువ్ పనిలోకి రావొద్దని హుకుం జారీ చేశారు.నువ్ ఇన్ని రోజుల సెలవులు పెడితే ఇక్కడ ఎవరు పని చేయాలని బెదిరించి నాటి నుండి నేటి వరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ప్రతిరోజు షాపింగ్ చుట్టూ తిప్పిస్తున్నారని ఆరోపించింది.తన భర్త మంచానికే పరిమితం కాగా నన్ను అకారణంగా షాపులోని పని తొలిగిస్తే నేను,నా పిల్లలు ఎలా జీవించాలని రోదిస్తోంది.తమకి ఎలాగైనా న్యాయం చేయాలని అనుబంధ కార్మిక సంఘ నాయకులను పిర్యాదు చేసినప్పటికి మాల్ వద్దకు వచ్చిన అధ్యక్ష, కార్యదర్శులు ఆమెకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చ లేదు.అంతేకాక మరో రెండు రోజుల గడువులో మాల్ యాజమాన్యంతో మాట్లాడతామని ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుండి పంపించినట్లు తెలిసింది.విషయం తెలుసుకున్న కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్తే వారికి కూడా ఏవో మాయ మాటలు చెప్పి అక్కడి నుండి పంపించినట్లు సమాచారం.మరి చివరకు ఆమెకు ఎవరు, ఎప్పుడు,ఎలా న్యాయం చేస్తారో వేచి చూడక తప్పదు అనిపిస్తుంది..