అధికారం… ఈ పదానికున్న పవర్ అంతా ఇంతా కాదు, అది ఉంటే ఒక లెక్క, లేకపోతే మరో లెక్క. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పరిస్థితి గీలెక్కనే ఉన్నది. గులాబీ పార్టీ గద్దెదిగిన తర్వాత, పోలోమంటూ హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు నేతలు. అలా క్యూ కట్టినవారు పోగా పోగా మిగిలిన వారు ఎక్కడ ఫోన్ ట్యాపింగుల్లో దొరుకుతామో, ఎక్కడ స్కాముల్లో బయటపడతామో అనే రీతిలో కుక్కినపేనుల్లా, తేలుకుట్టిన దొంగల్లా అలా నక్కి నక్కి ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చిన్నంతరం, పెద్దంతరం అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు, ఏదిపడితే అది మాట్లాడిన నేతలు… ఇప్పుడు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అందరిలో కాకపోయినా కొందరిలోనైనా ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ విలేకర్ల సమావేశంలో ఓ మాజీ మంత్రి మాట్లాడుతూ…’సీఎం రేవంత్ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ పెద్దలు, వారు పెద్ద మనసు చేసుకోవాలి, మా విన్నపాల్ని స్వీకరించాలి…’ లాంటి పదాల్ని పదేపదే వాడారు. ఇందులో ప్రత్యేకతేముందని అనుకుంటున్నారా? ఉంది, కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇదే ఎక్స్ మినిష్టర్… ఓ ఆర్నెల్ల కింద నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్ సందర్భంగా… ప్రతిపక్షాల విమర్శల గురించి పాత్రికేయులు ప్రస్తావించగా… ‘అయితే ఏందంట, మమ్మల్ని వాళ్లేమైనా పీ..రా, అసలు ప్రతిపక్షమంటే ఎవరు? ఈ రాష్ట్రంలో అపోజీషన్ ఉందా? అంతా మేమే కదా…,సో వాట్, అప్‌కోర్స్…’ లాంటి పదాలు వాడుతూ విపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఎంతమాత్రమూ విలువనివ్వకుండా నిర్లక్ష్యంగా మాట్లాడారు. అప్పుడు నెత్తిమీదున్న కండ్లు, ఇప్పుడు కాస్త కిందికి దిగినట్టుంది. అందుకే ‘సీఎం గారు, ప్రజల విజ్ఞప్తులు, జనం సమస్యలు…’ అంటూ ఆయన మొదలుపెట్టారు. ఇదే విషయంపై అదే మాజీ మంత్రివర్యుణ్ని అడిగితే…’ఏ ఊరుకో అన్నా…నువ్వు పాతయ్యన్నీ తవ్వుతవ్…’ అంటూ మెల్లగా జారుకున్నారు. అబ్బా… ఆయనలో ఎంత మార్పో…
-బి.వి.యన్.పద్మరాజు