రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు నిలుపుదల

– అస్సాం హైకోర్టు స్టే ఆదేశం
– నిషేధం నీడలో డబ్ల్యూఎఫ్‌ఐ

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సమస్య మరింత ముదురుతోంది. ఓ వైపు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలనే రెజ్లర్ల డిమాండ్‌ అలాగే ఉండిపోగా.. మరోవైపు జులై 11న నిర్వహించాల్సిన ఎన్నికలను నిలుపుదల చేయాలని అస్సాం హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పలు వాయిదాల అనంతరం జులై 11న ఎన్నికలు నిర్వహించి బాధ్యతలను నూతన పాలక మండలిని అప్పగించాలనే అడ్‌హాక్‌ కమిటీ ఆలోచనకు అస్సాం రెజ్లింగ్‌ సంఘం బ్రేక్‌ వేసింది. ఇక బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన ఆరుగురు రెజర్లకు ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ ట్రయల్స్‌లో ఒక్క బౌట్‌ పోటీ మాత్రమే ఉంటుందని మినహాయింపులు ఇవ్వటంపై సైతం రెజ్లింగ్‌ సమాఖ్యలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
ఎందుకు? : 2014, నవంబర్‌ 15న ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య సమావేశంలో అస్సాం రెజ్లింగ్‌ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీర్మానించింది. అయితే, ఆ సమావేశంలో గుర్తింపు దక్కేందుకు ఆమోదం లభించినా.. తాజా ఎన్నికల్లో పాల్గొనేందుకు అడ్‌హాక్‌ కమిటీ అనుమతి ఇవ్వలేదు. దీంతో అడ్‌హాక్‌ కమిటీ, క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా అస్సాం రెజ్లింగ్‌ సంఘం ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషను దాఖలు చేసింది. వాదనల అనంతరం భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలపై స్టే విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. జులై 17కు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, 2014 ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అస్సాం రెజ్లింగ్‌ సంఘం ఏడేండ్లు ఎందుకు వేచి చూసిందనే సందేహం రెజ్లింగ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వేటు ముప్పు : భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో నిషేధం విధిస్తామని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యూడబ్ల్యూ) ఓ ప్రకటనలో తీవ్ర స్వరంతో హెచ్చరించింది. తాజాగా అడ్‌హాక్‌ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన చేయటంతో అంతర్జాతీయ రెజ్లింగ్‌ బాడీ సైతం శాంతించింది. తాజాగా అస్సాం హైకోర్టు ఎన్నికలపై స్టే ఆర్డర్‌ ఇవ్వటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. యుడబ్ల్యూడబ్ల్యూ నిర్దేశించిన గడువులో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్‌ సమాఖ్య నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో భారత రెజ్లర్లు ఇండిపెండెంట్‌ అథ్లెట్లుగా పోటీ చేయాల్సి ఉంటుంది. పతకాలు సాధించినా భారత జాతీయ గీతం, జాతీయ జెండాను మెడల్‌ పోడియంపై అనుమతించరు.
ఇప్పుడెలా?! : అస్సాం హైకోర్టు నిలుపుదల ఆదేశాలతో అడ్‌హాక్‌ కమిటీ చిక్కుల్లో పడింది. ఇది వరకే పలు రాష్ట్రాలు సైతం తమను ఎలక్టోరల్‌ జాబితాలోకి తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారిని కోరిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం జులై 11న ఎన్నికలు నిర్వహించేందుకు అడ్‌హాక్‌ కమిటీకి ఒకే మార్గం ఉంది. అస్సాం రెజ్లింగ్‌ సంఘంతో అడ్‌హాక్‌ కమిటీ రాజీ చేసుకోవాలి. లేదంటే, జులై 17న తదుపరి విచారణ వరకు వేచి చూడాలి. అలా జరిగితే జులై 11న ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు. అప్పుడు భారత రెజ్లింగ్‌ సమాఖ్య సంక్షోభంలో కూరుకునే ప్రమాదం ఉంది.