సమసమాజాన్ని కోరుతున్న రచయిత్రులు

Writers seeking communityసాహిత్యమూ ఓ ఉద్యమమే. స్వాతంత్రోద్యమం ముందు నుండి ఇది రుజువవుతూనే ఉంది. సమాజాన్ని చైతన్య పరచడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. అటువంటి సాహిత్వాన్ని సృష్టిస్తున్న వారిలో మహిళలు సైతం సగభాగం ఉన్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే సగం కంటే ఎక్కువే ఉన్నారు. వివిధ సామాజిక సమస్యలపై తమ కలాన్ని కదిలిస్తున్నారు. తమ అక్షరాలతో సమసమాజం కోసం తపిస్తున్నారు. అలాంటి వారే ఈ నలుగురు రచయిత్రులు. ఈరోజు వారు రచించిన గ్రంథాలకు తెలుగు యూనివర్సిటీ నుండి సాహితీ పురస్కారాలు అందుకోబోతున్న సందర్భంగా మానవి వారికి అభినందనలు తెలియజేస్తోంది.
Tulasiప్రజలకు మరింత చేరువవుతుంది
చాగంటి తులసి… 1937లో విజయనగరంలో పుట్టారు. ఈమె ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు కుమార్తె. తండ్రి, ఆయన స్నేహితులు గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు. వారి మధ్య గొప్పవారు అన్న స్పృహ లేకుండా వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగారామె. అంతే సహజంగా ఎదిగారు. వారి పెంపకంలో చదవడం అలవర్చుకున్నారు. సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఇచ్చింది ఆ కుటుంబం. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని మంచి కవయిత్రిగా తీర్చి దిద్దబడ్డారు. వలయం, తిరోగామి వంటి ఆలోచింపచేసిన కథలు రాసిన ఆమె 1946లో బాలపత్రికలో మొదటికథ రాశారు. 50వ దశకం నుంచే పురోగామి దృక్పథంతో కథలు రాయడం మొదలుపెట్టారు. 14 కథలతో వచ్చిన ‘తులసి కథలు’ కథాసంపుటి, ‘యాత్ర” చిన్న నవల, ‘సాహితీ తులసి’ అనే వ్యాససంపుటి, ‘తగవు’ అనే నాటిక ఆమె తెలుగు రచనలు కాగా అనువాదాలు ఎక్కువ చేసారు. హిందీ నుంచీ రాహుల్‌సాంకృత్యాయన్‌ ‘ఓల్గా నుంచి గంగ వరకు’, సఫ్దర్‌ హస్మి ‘హల్లాబోల్‌’, డాక్టర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర అనువదించారు. ప్రసిద్ధ తెలుగు కథలెన్నింటినో హిందీ, ఒరియాలోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు. హిందీలో ‘మహాదేవీకీ కవితామే సౌందర్య భావన్‌’ అనే విషయంపై డాక్టరేట్‌ తీసుకున్న ఆమె ఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్‌గా పనిచేశారు. తర్వాత దక్షిణ కొరియా సియోల్‌లోని హాంకుక్‌ యూనివర్సిటీలో గెస్ట్‌ ప్రొఫెసర్‌గా హిందీ బోధించారు. పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం విజయనగరంలో వుంటున్నారు. మధ్యతరగతి జీవులనెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారామె. గుడిసెవాసులకి బుల్డోజర్లనుంచి ఎంత ప్రమాదం వుందో ప్రకృతినుంచీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ ‘స్వర్గారోహణ’.
ఈమె సాహిత్య సేవలకు గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సర్వోత్తమ కథారచయిత పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సమ్మాన్‌, కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అరసం సత్కారం, నాళం కృష్ణారావు స్మారక సత్కారం, మొదలైన పురస్కారాలను అందుకున్నారు. 1994లో చాసో సాహిత్య ట్రస్టును స్థాపించి ప్రతి ఏడాది ఉత్తమ సాహిత్య స్రష్టలకు చాసో స్ఫూర్తి అవార్డు ఇస్తున్నారు. ప్రస్తుతం రచయిత్రి ఉత్తమ గ్రంథం కింద తన ‘రంగంటే ఇష్టం’ గ్రంథానికి పురస్కారం అందుకోబోతున్న ఈమె ‘పురస్కారం వల్ల ఈ పుస్తకం మరింత మందికి చేరువకాబోతుంది. ఈ పుస్తకం ముద్రించినపుడు ఎంతో మంది నాకు ఫోన్లు చేసి ఎంతో బాగుంది అని అభినందనలు తెలియ జేశారు. ఇది కేవలం నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుస్తకమం మాత్రమే కాదు, ఎన్నో వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ సమాజానికి, సాహిత్యలోకానికి ఈ రూపంలో మరింతగా చేరువకాబోతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటున్నారు. అలాగే కొత్తగా రాసేవారైనా, ప్రస్తుతం రాస్తున్న వారైనా, బాగా ప్రాచుర్యం పొందిన రచయితలైనా నిరంతరం అధ్యయనం చేయాలని ఆమె కోరుకుంటున్నారు.
Yakammaదళిత బతుకు వ్యధలే ‘కెరటం’
డా.తాళ్ళపల్లి యాకమ్మ… మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఈమె దళిత కుటుంబంలో పుట్టారు. ఎంఏ తెలుగు, సంస్కృతం చేసి ఎం.ఫీల్‌, పీహెచ్డీ పట్టా అందుకున్నారు. టి.పి.టి పూర్తి చేసి ఏపీ సెట్‌, యూజీసీ నెట్‌లో క్వాలిఫై అయ్యి ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌గా జడ్పిహెచ్‌ఎస్‌ కురవి, మహబూబాబాద్‌ జిల్లాలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే రచన వ్యాసంగం తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఇప్పటి వరకు బోయ జంగయ్య సాహిత్యానుశీలన, మమతల మల్లెలు, జగడం ఒక పరిశీలన, కెరటం, రక్షణ, మట్టి బంధం, దు:ఖ నది అనే పుస్తకాలను ముద్రించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ వారి ఉత్తమ రచయిత్రి అవార్డు, డాక్టర్‌ పుట్ల హేమలత, పలుగుల భూమారెడ్డి స్మారక ఉత్తమ ఉపాధ్యాయ, నందివాడ రత్నశ్రీ, పర్సా సైదులు పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఉరిమళ్ళఫౌండేషన్‌ జాతీయస్థాయి ఉత్తమ కవితా పురస్కారం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, వెంకట సుబ్బు మెమోరియల్‌ అవార్డు వంటివి ఎన్నో అందుకున్నారు.
ప్రస్తుతం పురస్కారం అందుకోబోతున్న ‘కెరటం’ నవలలో వస్తువు దళిత జీవితం. మాదిగ గూడెంలోని కటిక దారిద్య్రం, దళితుల అమాయకత్వం, మౌడ్యం, నిరక్షరాస్యత మొదలైన విషయాలు ఇతివృత్తంగా ఆమె చిత్రించారు. ఇందులోని పాత్రలన్నీ కథాగమనంలో సహజాతి సహజంగా ఒదిగిపోయేలా రాశారు. స్వయంగా దళిత వర్గానికి చెందిన రచయిత్రిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఉపాధ్యాయునిగా ఎదిగి తన కాళ్ళ మీద తను నిలబడే శక్తిని సంపాదించారు. అయినప్పటికీ తన పుట్టి పెరిగిన మూలాలను మరిచిపోలేదు. తను ఏ వర్గానికైతే చెందిందో ఆ వర్గం వారి గురించి ముఖ్యంగా మన సమాజంలో వారు ఎదుర్కొనే వివక్ష గురించి, అణచివేత గురించి హింస గురించి రాయాలన్న పట్టుదలే ఆమెతో ఈ ‘కెరటం’ నవల రాయించింది.

నడుస్తున్న ఉద్యమాల్లో భాగం.. ఈ నాటకాలు
దేవి… నాటకం ప్రక్రియలో తన ‘స్వాతంత్రోద్యమ వీరుల నాటక త్రయం’ గ్రంథానికి పురస్కారం అందుకోబోతున్నారు. ఈ గ్రంథం గురించి ఆమె ‘నాటకం రాయడంలోనో, దర్శకత్వం వహించడంలోనో నిపుణత మాట అటుంచి ప్రాథమిక శిక్షణ అయినా లేదు నాకు. ప్రజానాట్యమండలి కోసం ఆయా సందర్భాల్లో అవసరం అయ్యింది కాబట్టి వీధినాటికలు, పాటలు, నృత్యరూపకాలు రాశాను. ఒక రకంగా అవసర రచయితను. ఈ నాటకలు… మతోన్మాదం చరిత్రను వక్రీకరిస్తున్న కాలంలో, స్వాతంత్య్ర పోరాట యోధులకు లేని మతం రంగు అద్దుతున్నపుడు, వారి చరిత్రను కళంకితం చేస్తున్నపుడు రాయల్సి వచ్చిన నాటకాలు ఇవి. గడిచిపోయిన కాలం మార్చలేనిది, వక్రీకరించకూడనిది. అయితే వ్యక్తుల ఆచరణను, ప్రజాసమూహాల ఘర్షణలను ఆయా నిర్దిష్ట కాలపు పరిస్థితుల్లో మాత్రమే చూడాలి. వ్యక్తుల పోరాట పటిమ జనాన్ని ఉత్తేజ పరుస్తుంది. ఎవరూ పరిపూర్ణులు కారు. కాని తమ బలహీనతలను అధిగమించి వ్యక్తిగత ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనాన్ని ఆశయంగా స్వీకరించే వరవడి ఉద్యమపథంలోనే దిద్దుకోగలుగుతాం. ఉద్యమం వ్యక్తులను ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ప్రభావితం చేస్తుంది.
ఈ ఉద్యమ కారుల చరిత్రను, నాటి పరిస్థితులను వీలయినంత, సమాచారం లభించినంతమేర లోతుగా చదివిన తరువాత ఈ నాటకాల రూపకల్పన జరిగింది. వ్యక్తుల వ్యక్తిగత వీరత్వాన్ని, సుగుణాలను పొగడడం కాకుండా వారిని అలా మలచిన ఘటనలు, ప్రజలు, వ్యక్తులు, భావాలను వ్యక్తీకరించాలన్నదే అభిమతం. రచయితలు తన అవగాహనను బట్టి, తమ చైతన్య స్థాయిని బట్టి చారిత్రక ఘట్టాలను చిత్రీకరిస్తారు. నడుస్తున్న కాలాన్ని అర్థం చేసుకోవడానికి గతాన్ని వాఖ్యానిస్తారు. ఈ వాఖ్య, వక్కాణింపు రచయిత సృజనాస్వేచ్ఛ. అయినా వాస్తవ ఆధారాలు మాత్రం వక్రీకరించే హక్కు ఎంత మాత్రం ఉండదు. రచయిత సమగ్రదృష్టి సమాజాన్ని ఆలోచింపచేసే దిశగా ఒక ముందడుగుకు స్ఫూర్తిగా సామరస్యం నిర్మించే క్రమంలో సాగాలి. సృజనకారులు విద్వేషాన్ని, విధ్వంసాన్ని తృణీకరించాలి. న్యాయమైన పోరాటాల పక్షం నిలబడాలి. ఈ నాటకాలు ఈ దృష్టితో రాసినవి. ఇవి నడుస్తున్న ఉద్యమాల్లో భాగం. ప్రజలకోసం నాటకం ఆడే ఎవరైనా వీటిని నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు’ అని తన మాటలో అంటారు.
కట్టలు తెంచుకున్న నీటి వరద
మెర్సీ మార్గరేట్‌… ఇంతకు ముందు ‘మాటలమడుగు’ అనే తన కవిత్వ సంపుటిని వెలువరించారు. ప్రస్తుతం పురస్కారం అందుకోబోతున్న ‘కాలం వాలిపోతున్న వైపు’ ఆమె రెండవ కవిత్వ సంపుటి. తన మొదటి పుస్తకం ఆమెకు ఎంతో గుర్తింపునూ, ప్రాచూర్యాన్ని కలిగించినప్పటికీ రెండవ పుస్తకం రూపా, సారాల విషయంలో ముందడుగునీ, విభిన్నతనీ, విస్తరణనీ కలిగి ఉందని చెప్పుకోవచ్చు. మాటల మడుగులో చాలావరకు గోప్యమైన నైరూప్యత కనిపిస్తుంది. ఒక రకమైన ఇంప్రెషనిస్ట్‌ యాటిట్యూడ్‌తో కవి చేసిన మానసిక సంచారం చదువరుల దృష్టికి వస్తుంది. జీవితం పట్ల, సమకాలీనత పట్ల నిర్దిష్టం కాని భావ ప్రవాహగానం వినిపిస్తుంది. ఈ ధోరణి నుంచి బయటపడి సమకాలీనత పట్ల కాంక్రీట్‌ అప్రోచ్‌ దృక్పథ ధోరణితో కవిత్వాన్ని పండించడాన్ని ఈ పుస్తకంలో మనం చూస్తాం. తను జీర్ణం చేసుకోలేని సమకాలీన పాలక రాజకీయాల పట్ల, మతోన్మాద వ్యాపారం పట్ల, స్త్రీల పీడనకు నిలిపి ఉంచగలుగుతున్న పితృస్వామ్య రాజకీయాల పట్ల, కులాన్ని అన్ని రకాల పెట్టుబడిగా ముందుకు తెచ్చిన కుల భావజాలం పట్ల, మెట్రో కల్చర్‌ మృగ్యమవుతున్న మానవ సంబంధాల పట్ల, పర్యావరణ కాలుష్యం పట్ల ఆగ్రహంతో క్షోభతో కొన్నిసార్లు కట్టలు తెగిన నీటి వరదల, మరికొన్ని సార్లు కంట్రోల్డ్‌ టోన్‌తో ఈ కవి కవిత్వం చేయటం ఈ పుస్తకంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.