కొత్త మండలానికి తప్పని తిప్పలు

– అద్దె భవనంలో నడుస్తున్న వ్యవసాయ కార్యాలయానికి ఆరు లక్షల బకాయిలు
– తాగునీరు, విద్యుత్‌ కోతలను అధిగమించాలని కోరిన ఎంపీపీ
– పాలకీడు మండల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చ
నవతెలంగాణ-పాలకీడు
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఆసజనకంగా నడిచింది. ప్రజా ప్రతినిధులు అనేక సమస్యలను అధికారుల దష్టికి తీసుకుపోవడంతో పాటు, సమాధానాలు రాబట్టారు. మండలంలో గిరిజన రైతాంగం నుండి పోడు భూములకు 2,506 అప్లికేషన్స్‌ వచ్చాయని, 7000 ఎకరాల భూమిని గుర్తించామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో ఎంతమందికి హక్కు పత్రాలు వస్తాయనేది తెలుస్తుందన్నారు. గ్రామాల్లో రైతులు వ్యవసాయ పొలాల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు బంద్‌ చేయకపోవడం వలన, పశువులు మత్యువాత పడుతున్నాయని, సర్పంచులు గ్రామాల్లో చాటింపు వేయించి రైతులకు అవగాహన కల్పించాలని పశువైద్యాధికారి శ్రీకాంత్‌ సమావేశం దష్టికి తెచ్చారు. మండలంలో 86శాతం పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని, 23 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జూన్‌ 2 నుండి 9 వరకు బడిబాట కార్యక్రమం చేపడతామని ఎంఈఓ శత్రు నాయక్‌ తెలిపారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా, మిషన్‌ భగీరథ అస్తవ్యస్తంగా తయారైందని ఎంపీటీసీలు వెంకటయ్య, శారద, సర్పంచులు క్రిష్టిపాటి అంజిరెడ్డి, నరసింహులు అధికారులను నిలదీశారు. మండల పరిషత్‌ నుంచి ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీపీ గోపాల్‌నాయక్‌ అధికారులను కోరారు. మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ తమ కార్యాలయానికి సుమారు 6 లక్షల వరకు అద్దె బకాయిలు రావాలని, కనీసం ఒక అటెండర్‌ కూడా లేని పరిస్థితి ఉందని సమావేశం దష్టికి తెచ్చారు. రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు పథకానికి కొత్తగా పాస్‌ బుక్కులు వచ్చినవారు జూన్‌ 16 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండలంలో ఇప్పటివరకు 80 మంది రైతులకు భీమా వర్తించింది అన్నారు. పంటల బీమా అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదని, రైతులు బ్యాంకు నుండి పంట రుణం పొందే సమయంలో ఇన్సూరెన్స్‌ అమలు చేస్తారని దానిపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ రుణాలు పొందిన రైతులు సకాలంలో రెన్యువల్‌ చేసుకొని, మండల వ్యవసాయ సహకార సంఘం సేవలను మరింతగా పొందాలని, పిఎసిఎస్‌ చైర్మెన్‌ సత్యనారాయణరెడ్డి సూచించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని విరివిగా అమలు జరిపి ఎక్కువ పని దినాలు కూలీలకు కల్పించాలని ఎంపీపీ అధికారులను కోరారు. గుండెబోయిన గూడెం, ఎల్లాపురం, తరతర అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా గుర్తించిన కరెంటు సమస్యలకు నేటికీ పరిష్కారం దొరకలేదని పలువురు అధికారులను ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద శాంక్షన్‌ అయి చేసిన పనులను, ఎప్పటికప్పుడు తమ కార్యాలయంలో పెండింగ్‌ లేకుండా ఎఫ్‌డీఓ జనరేట్‌ చేసి పంపిస్తున్నామని ఎంపీడీవో వెంకటాచారి సమావేశం దష్టికి తెచ్చారు. రోడ్ల భవనాలు శాఖ కింద మండలంలో ఉన్న ఐదు ప్రధాన రహదారులకు పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని సమావేశం అభిప్రాయపడింది. మండలంలో కొత్తగా ఏడు గ్రామ పంచాయతీ భవనాలు శాంక్షన్‌ అయినట్లు, జూన్‌ 2 నుండి 22 వరకు తెలంగాణ శతాబ్ది ఉత్సవాలను గ్రామస్థాయిలో నిర్వహించాలని, ఎంపీఓ దయాకర్‌ సూచించారు. వద్ధాప్య పెన్షన్‌ తీసుకునే వద్ధుడు మరణిస్తే, ఆ పెన్షన్‌ భార్యకు వర్తింపజేయడంలో ఆలస్యం చేయవద్దని అధికారులను సమావేశం కోరింది. ఈ సమావేశంలో ఎంపీటీసీలు కవిత, మీసాల ఉపేందర్‌, సర్పంచులు నంబూరు కష్ణారెడ్డి, కిష్టపాటి అంజిరెడ్డి, నరసింహ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.