ఇండియాలో జి-20 సమావేశానికి జిన్పింగ్‌ గైర్హాజర్‌…?

ఇండియాలో జరగనున్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్‌ వ్యక్తిగతంగా హాజరుకాకపోవచ్చని చైనీస్‌, భారత అధికారులు రాయిటర్స్‌ వార్తా సంస్థకు చెప్పారు. కొత్త డిల్లీలో సెప్టెంబర్‌ 9-10 తేదీలలో జరగనున్న జి-20 శిఖరాగ్ర సదస్సులో చైనా డెలిగేషన్‌ కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్‌ కి బదులుగా చైనా ప్రధాని లి క్వియాంగ్‌ నాయకత్వం వహి స్తారని రాయిటర్స్‌ పేర్కొంది. అయితే ఏ కారణంచేత చైనా అధ్యక్షుడు భారతదేశంలో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావటం లేదో ఈ విషయాన్ని వెల్లడించిన వారు చెప్ప లేదు. ఇండియా, చైనా విదేశాంగ మంత్రి త్వ శాఖలు రాయిటర్స్‌ వార్తాసంస్థ వెల్ల డించిన విషయంపైన వ్యాఖ్యానించ టానికి నిరాకరించాయి. 2022లో గట్టిగా అమలుచేసిన కోవిడ్‌-19 నియంత్రణలను ఎత్తివేశాక జిన్పింగ్‌ కేవలం రెండు విదేశీ యాత్రలనే చేశాడు. మార్చినెలలో రష్యా అధ్యక్షుడు వ్లాడీమీర్‌ పుతిన్‌ తో చర్చలు జరపటానికి ఆయన మాస్కోను సందర్శిం చాడు. గతవారంలో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశానికి ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యాడు. జొహాన్నెస్‌ బర్గ్‌ లో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో హాజరయినప్పుడు విరామ సమయంలో భారతదేశం, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం కారణం గా రెండు దేశాలమధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచే మార్గాలను గురించి జిన్పింగ్‌ భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిం చాడు. అయితే ఈ వారం ఆరంభంలో భారతీయ భూభాగాలను చైనా తనవిగా ఒక మ్యాప్‌లో చూపిందని భారత ప్రభుత్వం నిరసన తెలిపింది. గతవారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత దేశంలో జరగనున్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావటంలేదని రష్యన్‌ ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ విషయంపైన అంతిమ నిర్ణయం జరగ లేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్‌ అన్నాడు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం రష్యాకు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ర్రోవ్‌ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జి-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే నిర్దారణ అయినది. గత నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలీలో జరిగిన చర్చల తరువాత బైడన్‌, జిన్పింగ్‌ ల ముఖాముఖి చర్చలను కవర్‌ చేయటానికి పశ్చిమ దేశాల మీడియా పెద్ద ఎత్తున్న కొత్త డిల్లీకి చేరు కుంటున్నట్టుగా తెలుస్తోంది.