వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: వై శంకర్..

– వర్షాకాలంలో త్రాగునీటి పై ప్రజలకు అవగాహన కల్పించాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి 
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో త్రాగునీటి పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, దోమలు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోనే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కి తెలియజేయాలని మండల అరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అన్నారు.సోమవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం ఆశా కార్యకర్తల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ పాల్గొని మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దోమలు పెరిగినట్లయితే దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, ఫైలేరియా లాంటి వ్యాధులు సోకే అవకాశం ఉంటుందని వివరించారు. దోమలు నివారణకు తగు చర్యలు తీసుకోనే విధంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని, నీరు నిల్వ గల ప్రాంతాలైన పూల తొట్టిలు, పడేసిన కొబ్బరి బొండాలు, వాడి పక్కకు ఉంచిన కూలర్లు వాటిలో నీరు నిల్వ ఉన్నట్లయితే నీటిని తొలగించాలని తెలిపారు. తల్లిపాల ఆవశ్యకత గురించి వివరించి పలు సూచనలు సలహాలు చేశారు.
ప్రసావం జరిగిన గంటలోపు వచ్చే ముర్రుపాలను కచ్చితంగా శిశువుకు తాగించాలని ఆ ముర్రుపాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని, అది జీవితాంతం ఒక టీ‌ కా లాగా పనిచేస్తుందని, తల్లిపాలు త్రాగిన వారు ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. వచ్చేనెల నుంచి ప్రారంభించబడిన వయోవృద్ధుల బిసి టీకా కార్యక్రమం ని ఉద్దేశించి ఇంటింటికి 18ఏళ్ళ పైబడిన వారందరి సర్వే చేయాలని ఆదేశించారు. గ్రామాలలో హైపర్ టెన్షన్ డయాబెటిక్ వ్యాధి గ్రాస్తులను గుర్తించి వారికి నెలకు సరిపడా మందులు అందజేయాలని తెలిపారు. జాతీయ క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా రెండు వారాలకు మించి దగ్గు జ్వరము కలిగిన ప్రతి ఒక్కరి నుండి తెమడ పరీక్ష నిమిత్తము తీసుకొని రావాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో గల పాఠశాలను హాస్టల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆరోగ్య కార్యకర్తలను సూచించారు.  దానికి సంబంధించిన ప్రణాళికను తయారు చేసి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఆరోగ్య కార్యకర్తలు వెంకటరెడ్డి, ఆనంద్, ఉదయ ,ఇందిరా ,స్వర్ణలత, భానుప్రియ ,రాధిక ,శారద ,సుజాత, అరుంధతి, సాయి వీర కుమారి, అనంత శీబారాణి ,సావిత్రి, శైలజ, భానుప్రియ, పాల్గొన్నారు.