
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్.బి.ఎస్.కె బృందాలతో సమీక్ష సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు హాజరై, మాట్లాడారు. గురువారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో ఆర్బీఎస్కే ప్రోగ్రాం యొక్క అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు, అనేక కీలక సూచనలు చేశారు. ఆర్బీఎస్కే బృందాలు రక్తహీనత (అనీమియా) గల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని , క్రానిక్ రోగాలకు సంబంధించిన లైన్ లిస్ట్‌ను సిద్ధం చేయాలన్నారు. కళ్ల పరీక్షల మొదటి, రెండవ దశల అమలు తీరును సమీక్షించి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.ప్రతి పాఠశాలలో హేమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, హెచ్బి టెస్టింగ్ రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్బీఎస్కే బృందం సభ్యులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.