యాలాల చరిత్ర యాత్ర

Yalala History Tourకొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌, కో-కన్వీనర్‌ బీవీ భద్రగిరీశ్‌, ఘంటా మనోహర్‌ రెడ్డి, యాలాల సభ్యులు గాజుల బస్వరాజు, వీరేశం, నర్సింహులు, చంద్రశేఖర్‌, మహేశ్‌, ప్రభాకరాచారి, శివశంకర్‌, వెంకటగిరిరాజు, అయ్యప్ప, అవినాశ్‌, వేంకటేశ్‌ తదితరులు వికారాబాద్‌ జిల్లా మండల కేంద్రం యాలాల, పొరుగు గ్రామం గోవిందరావుపేటలలో క్షేత్రసందర్శన చేసి, పురాతన ఆలయాలను, పదులకొద్ది విడివిగ్రహాలను పరిశీలించారు. గోవిందరావుపేట గ్రామంకు వెళ్లే మార్గంలో బేతాలుడు అని పిలిచే శంగిని, గోవింద్‌రావుపేట శివాలయంలోని జైనవిగ్రహాలను, వరాహస్వామి విగ్రహం, మార్కండేయమందిరం, శివాలయం, బొన్నమ్మ మందిరం, చౌడేశ్వరి ఆలయం, రామలింగేశ్వరాలయం, యాలాల గ్రామంలో బసవన్న గుడి, నగరేశ్వరాలయం, వీరభద్రాలయం, హన్‌మాన్‌ మందిరాలను సందర్శించారు. వీర(గల్లు)మల్లు విగ్రహాన్ని పరిశిలించారు. యాలాల, గోవిందరావుపేటలలో అడుగడుగునా విష్ణుకుండిన, రాష్ట్రకూట శైలులకు చెందిన పెద్దశివలింగాలు, నందులను గుర్తించారు. జైన శిల్పాలను చూశారు. యాలాలలో వీధివీధిన గుడులు ఏకరీతి నిర్మాణాలతో ఆశ్చర్యపరిచాయి. యాలాలలో నందికికట్టిన బసవన్న గుడి విశేషం. ఒక మీటరు ఎత్తు, అరమీటరు వెడల్పులతో, మెడలో పెద్దమువ్వలు, గంగడోలుతో అందమైన శిల్పం ఈ నంది. ఇటువంటి నంది నాగర్‌ కర్నూలు జిల్లా ఇంద్రకల్లులో ఉన్నది. ఈ రెండు నందులు రాష్ట్రకూటశైలికి చెందినవే.
బసవన్నగుడి ముందర ఒక వేదికలో ఇమిడ్చి కట్టిన 10,11వ శతాబ్దాలనాటి కళ్యాణీ చాళుక్యుల శాసనం కనిపించింది.
గోవిందరావుపేటలో ఉత్తరవాహినియైన కక్కెరవేణి (కాకరవాని)నది ఒడ్డున వాకాటకశైలిలో చెక్కిన భూవరాహమూర్తి విగ్రహం అద్భుతశిల్పం. చతుర్భుజుడైన వరాహస్వామి పరహస్తాలలో ప్రయోగచక్రం, శంఖాలు, నిజహస్తాలలో ఎడమచేయి కటిహస్తం, కుడిచేయి సూచీముద్రతో, వేలిపై నిలిపిన భూదేవి, కుడికాలు శేషసర్పంపై పెట్టి నిలబడిన స్థానకశిల్పం. 5,6 శతాబ్దాలకు చెందిన ఈ శిల్పం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉదయగిరిగుహల్లో ఉన్న వరాహమూర్తిని పోలివుంది. శిథిలాలలో పడిఉన్న ఈ శిల్పానికి త్వరలో గుడికట్టే ఆలోచనలో ఉన్నామని స్థానిక గ్రామప్రజలు చెప్పారు. ప్రభుత్వ సహాయాన్ని ఆశిస్తున్నామన్నారు.
క్షేత్ర సందర్శన, చారిత్రక కథనం: శ్రీరామోజు హరగోపాల్‌, బీవీభద్రగిరీశ్‌, కన్వీనర్‌, కో కన్వీనర్లు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం,
9949498698, 9177301451