నిన్నటి వరకు జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారత దేశం చైనాను వెనక్కినెట్టి మొదటి స్థానానికి చేరుకుంది. జనాభా విషయంలో ప్రపంచంతో పోటీ పడుతున్నా క్రీడల్లో మాత్రం ఇండియా అట్టడుగు స్థాయిలో ఉంది. క్రికెట్, హకీ లాంటి కొన్ని ఆటల్లో తప్ప పెద్దగా ప్రతిభ చూపిన దాఖలాలు లేవు. ఒలంపిక్స్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. 150 కోట్ల జనాభాకు, మన క్రీడాకారులు తెస్తున్న పథకాలకు సంబంధం లేకుండా ఉంది. అయినా వారిననడం తప్పే. వాళ్లనలా తయారు చేసిన క్రీడా సంఘాలు, రాజకీయ నాయకులదే పూర్తి బాధ్యత! ‘యథా రాజా… తథా ప్రజా’. అవునూ.. సామెతలు ఊరకనే పుట్టుకుని రాలేదు. అనుభవాల సారంగానే వాడుకలోకి వచ్చాయి. రాజెలా ఉంటే అక్కడి ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజకీయ వ్యవస్థ మూలాల క్రమంలోనే క్రీడా రంగం తయారైంది. ఎంపిక నుంచి శిక్షణ వరకూ అన్నింటా రాజకీయాలే. ఎలాంటి ప్రావీణ్యం లేని వారు అందలం ఎక్కుతుంటే, అత్యంత ప్రతిభ గలవారు మరుగున పడిపోతు న్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. వీటికి తోడు కక్షలు, వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. క్రీడా సంఘం పెద్దాయన తమను లైంగికవేధిం పులకు గురిచేస్తున్నారని భారత రెజ్లర్లు ఢిల్లీ వేదికగా నెలల తరబడి పోరాటం చేసినా పాలకులు పట్టించుకోలేదు. ఇలాంటి ఘటనల్ని చూస్తే కొత్తగా ఈ రంగానికి రావాలంటే ఎంత ప్రతిభ ఉన్నవారైనా ఆలోచిస్తారు. ముందు ఆ వ్యవస్థలోని లోపాలను సరిద్దే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే క్రీడారంగంలో మనమెక్కడు న్నామో పారిస్ ఒలంపిక్ పట్టికను చూస్తే అర్థమవుతుంది. విశ్వ విఫణిలో భారత పతాకాన్ని రెపరెపలాడించే క్రమ శిక్షణ, నిబద్దత కలిగిన క్రీడాకారులను తయారుచేసే దిశగా సర్కార్ సాగితేనే మనదేశానికి పేరు.
– ఊరగొండ మల్లేశం