– సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ ఖండన
అమరావతి : రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ పిల్లిమొగ్గల్ని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ రాజధానిగా మరికొంతకాలం వుండాలని వైసీపీ అధికార ప్రతినిధి వైవి సుబ్బారెడ్డి ప్రతిపాదించడం, దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతపాడటం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉందని విమర్శించారు. అంతేకాకుండా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోందని విమర్శించారు. ఇటువంటి చర్చల్ని ఆపేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్ వద్ద పోలీసులను మోహరించి నాటకమాడినట్టు ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. అలాగే అమరావతి రాజధానిగా దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వుందని తెలిపారు. ఈ చర్య రాష్ట్ర ప్రజలకు ఏమాత్రమూ సమ్మతం కాదన్నారు. హైదరాబాద్‌ను వదిలేసి పదేండ్లయిందని, ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటూ కొత్త చర్చను లేవదీసి మొత్తం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరైందికాదని అన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించి అభివృద్ధి చేయకపోతే వైసీపీని ప్రజలు క్షమించరని తెలిపారు.