కామ్రేడ్ సీతారాం ఏచూరి సెప్టెంబరు 12, 2024 న న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ళ వయసులో, శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో తుది శ్వాస విడిచాడు. కామ్రేడ్ సీతారాం అర్ధాంతర, అకాల మహాభినిష్క్రమణ ఆయన ప్రధాన కార్యదర్శిగావున్న సిపిఎం కే కాకుండా అన్ని పార్టీలలో, ఎన్నో రంగాలలోవున్న అసంఖ్యాకమైన ఆయన స్నేహితులను అంతులేని దు:ఖంలో ముంచింది. వ్యక్తిగతంగా నేను ఒక గొప్ప స్నేహితుడిని, మార్గదర్శిని కోల్పోయాను. నేను క్రియాశీలంగా వున్న పార్టీ ఒక మహానాయకుడిని కోల్పోయింది.
కామ్రేడ్ సీతారాం హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివాడు. ఆయన అత్యంత తెలివైన, చురుకైన విద్యార్థిగా ఉండేవాడు. 1966లో ఆయన యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ బహుమతిని గెలుచుకున్నాడు. అది ఆయన్ని అమెరికాకు తీసుకువెళ్లటమే కాకుండా, అమెరికా అధ్యక్ష భవనంలో అధ్యక్షుడితో అల్పాహార సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించింది. అప్పటి యువతలో పాపులర్‌గా వున్న జూనియర్ స్టేట్స్ మన్ లేదా జెఎస్ మ్యాగజైన్ ఆయనను భావి భారత ప్రధానిఃగా అభివర్ణించింది. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో విద్యాభ్యాసానికి కలిగిన ఆటంకం కారణంగా ఆయన పాఠశాల విద్యను పూర్తి చేసేందుకు హైదరాబాద్‌ను విడిచిపెట్టి న్యూఢిల్లీకి వెళ్ళాడు. అంతటా ప్రతిభ కనబరిచిన విద్యార్థిగా సీతారాం న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అర్థశాస్త్రం(ఆనర్స్) చేశాడు. ఆపై ఎం.ఏ ఆర్థిక శాస్త్రం చదవడానికి 1973లో జేఎన్‌యులో చేరాడు. జేెఎన్ యులో లెజెండరీ ప్రొఫెసర్ కష్ణా భరద్వాజ్ (ప్రముఖ మానవహక్కుల యాక్టివిస్టు, మేధావి సుధా భరద్వాజ్ మాతృమూర్తి) దగ్గర చదువుకున్నాడు.
1976లో జేఎన్‌యు లో చేరగానే నేను ఎస్‌ఎఫ్‌ఐ అని కామ్రేడ్స్‌కి తెలిసిపోయింది. 1976-77లో ఎమర్జన్సీ ముగిసేదాకా దేశంలో జరుగుతున్న అణచివేతపైన జేఎన్‌యు సైక్లోస్టైల్ చేసిన కరపత్రాలను అర్ధరాత్రులు పంచేవాళ్ళం. ఎస్.ఎఫ్.ఐ నినాదం ఃఅధ్యయనం-పోరాటంః జేఎన్‌యులో నూటికి నూరు శాతం అమలయింది. (సీతారాం రాసిన టర్మ్ పేపర్ కి ప్రొఫెసర్ కృష్ణా భరద్వాజ్ a గ్రేడ్ ఇచ్చిందంటే అది అత్యంత గరిష్ట స్థాయిని కూడా మించి ఉందని అర్ధం). అటువంటి అసాధారణ విద్యార్థులు జెఎన్‌యు లో ఎంతోమంది ఉండేవారు. వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలపై చర్చోప చర్చలు, అంతకు మించి అధ్యయనం ఏకకాలంలో సాగేది ఒక్క జేెఎన్‌యులోనే అనుకుంటా! మార్క్సిస్ట్ సైద్ధాంతిక అధ్యయనం, తరగతిగది చదువుల కోసం 24గంటలు సరిపోయేవికాదు. సాయంత్రం డిన్నర్ అవగానే మళ్ళీ రాజకీయ ఉపన్యాసాలు, చర్చలు ఉండేవి.
అలా నడుస్తున్న క్రమంలో 1977లో ఎమర్జన్సీని ఎత్తివేశారు. కామ్రేడ్ సీతారాంతో సహా అజ్ఞాతంలో వున్న నాయకులందరూ బయటకు వచ్చారు. ఒక్కసారిగా జేఎన్‌యులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. జనతాపార్టీ గెలిచింది. జనతాపార్టీ గెలుపుతో జేఎన్‌యులోని కమ్యూనిస్టు వ్యతిరేకులు ఫ్రీథింకర్స్ పేరుతో ఏకమయ్యారు. సీతారాం ఎస్‌ఎఫ్‌ఐ నుంచి అధ్యకుడిగా గెలిచాడు. ప్రచారం అంతా స్టాలిన్, ట్రాట్క్సీ చూట్టూ తిరిగింది. మార్క్సిజానికి సంబంధించిన అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. సోషలిజం, ప్రజాస్వామ్యం, విప్లవం, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, యంగ్ మార్క్స్, ఆంటోనియో గ్రాంషి, ఆల్థూజర్‌ల సైద్ధాంతిక ప్రతిపాదనలు నిత్య చర్చనీయాంశాలుగా మారాయి. జేఎన్‌యులో విద్యార్థి సంఘం తీసుకునే ప్రధాన నిర్ణయాలన్నీ యూనివర్సిటీ జనరల్ బాడీ ఆమోదం పొందాలి. కామ్రేడ్ సీతారాం అధ్యక్షతన అటువంటి జనరల్‌బాడీ సమావేశాలు చాలానే జరిగాయి. జేెఎన్‌యు జనరల్ బాడీ సమావేశం ఉదయం మొదలయితే తెల్లవారుజాముదాకా సాగేది. దాదాపు 100మంది ఉపన్యాసకులు మాట్లాడేవారు. ఈ సమావేశంలో భాగంగా అనేక పాయింట్స్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేవారు. ఉదయం 8-9 గంటల నుంచి తెల్లవారుజామున 5-6 గంటలదాకా జరిగే జనరల్ బాడీ మీటింగ్‌కు సీతారాం అధ్యక్షత వహించేవాడు. అన్ని గంటలూ ఓపికగా సమాధానాలు చెప్పేవాడు. ఉపన్యాసాలలో చాలావరకు రాజకీయ అంశాలే ఉండేవి.
పార్లమెంట్‌లో జరిగే చర్చలకంటే మేధోపరంగా లోతైన, వాడి, వేడి చర్చలు జె.ఎన్.యు లో జరిగేవి. రాజకీయాలను సునాయాసంగా హాండిల్ చేయటంలో కామ్రేడ్ సీతారాం ఏచూరికి జేెఎన్‌యు అనుభవం చాలా ఉపయోగపడివుంటుంది. ఏచూరి తన జీవితమంతా ఆలోచనాత్మకత, విమర్శనాత్మకత, జిజ్ఞాసిత, సంఘీభావ స్వభావం అంతర్భాగమైన జెఎన్‌యు సంస్కృతిని ప్రతిబింబించాడు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆ తరువాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆ పైన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం తనదైన శైలిలో సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేశాడు. పార్టీయేతరులకు, కనీసం పరిచయం లేకపోయినా సరే, అందరికీ అందుబాటులో వున్న కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరీనే అంటే అతిశయోక్తి కాదేమో. ఒక సమూహంలో తను ఉన్నాడంటే అదో సంబరంగా ఉండేది. తను మాట్లేడేటప్పుడు ఎదుటివాళ్ళకు ఒక జాతీయ నాయకుడితో మాట్లాడుతున్న భావనే కలుగనిచ్చేవాడు కాదు. శత్రుశిబిరంలోకి అలవోకగా ప్రవేశించి, అంతే సులువుగా ప్రత్యర్థుల వాదనను కొట్టివేసినట్టు కనపడకుండా తన అవగాహనను ఎదుటివాళ్ళకు నచ్చేలా చేయగలిగేవాడు. ఇక్కడే సీతారాంను మిగిలినవాళ్ళ కంటే వేరుగా చూపింది. ఈ లక్షణమే సీతారాంను ప్రత్యేకంగా నిలిపింది. కమ్యూనిస్టులు కానివాళ్ళు ఒక కమ్యూనిస్టు నాయకుడికి ఇంతగా దుఃఖాన్ని ప్రకటించిన సందర్భం గతంలో ఎన్నడూ లేదేమో.
కామ్రేడ్ సీతారాం ఏచూరి 2005 నుండి 2017 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. 2016 లో ఉన్నత విద్యా సంస్థలలో నెలకొన్న పరిస్థితులపై జరిగిన చర్చలో రాజ్యసభలో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించడం భారత ప్రజాస్వామ్యానికి ఎంత అవసరమో చెప్పాడు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో మాట్లాడుతూ 2016లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని కొంతమంది విద్యార్థులపై దేశద్రోహ అభియోగాలు మోపబడటం, అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని దళిత విద్యార్థి రోహిత్ వేముల దళిత గుర్తింపు కారణంగా ఫెలోషిప్ ఆగిపోవడంతో ఆత్మహత్య చేసుకోవటం ఆందోళన కలిగించే విషయాలని చెప్పాడు. మోదీ పాలనలో జేఎన్‌యూ, హెచ్‌సియూ తదితర ఉన్నత విద్యాసంస్థల పట్ల వ్యవహరించిన తీరుతో సమసమాజం అనే రాజ్యాంగ దార్శనికతను తుంగలో తొక్కారని ఏచూరి అన్నాడు. దేశ ద్రోహుల రహస్య కేంద్రాలుగా వీటిని ఖండిస్తే ప్రతి చోటా అత్యుత్తమ విద్యార్థులను తయారు చేసే ప్రఖ్యాతి గాంచిన యూనివర్శిటీల్లో చదువుకోవాలనే తపన ఉన్న యువత భవిష్యత్తు దెబ్బతింటుందని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మతతత్వాన్ని సష్టించేందుకు బీజేపీ జాతీయవాదాన్ని ఉపయోగించుకుందని ఆయన ఆరోపించాడు.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కుదించబడిన రిజర్వేషన్ సౌకర్యాలను కాపాడేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే, పార్లమెంటు రెండు రోజుల సమావేశంలో అంబేద్కర్ గురించి చర్చించడం సరిపోదని ఏచూరి తన ప్రసంగంలో అన్నాడు. ఇది ఃరాజ్యాంగంపై తిరుగుబాటుః అని సీతారాం ప్రకటించాడు. 2014 తర్వాత అత్యంత క్రూరంగా అనుసరించిన నయా ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు నాశనమయ్యాయని, అక్కడ అందుబాటులో ఉన్న ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయని కామ్రేడ్ ఏచూరి చాలా గట్టిగా వాదించాడు. తత్ఫలితంగా రిజర్వేషన్ సౌకర్యాల వల్ల ఆ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారు ఉపాధి అవకాశాలను కోల్పోయి నిస్సహాయులగా మారారని ఆయన అన్నాడు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రయివేట్ రంగంలోని ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పన అనివార్యమౌతుందని సీతారాం వాదించాడు. భారత రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ 2002లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, వైవిధ్యం(డైవర్శిటీ) బిల్లు వంటి సామాజిక విధానాలను ప్రైవేట్ రంగం అవలంభించాలని, అమెరికా వంటి పెట్టుబడిదారీ దేశం ఆమోదించి, అమలు చేస్తున్న నిశ్చయాత్మక (ఎఫర్మేటివ్ యాక్షన్) చర్యను అనుసరించాలని విజ్ఞప్తి చేశాడు. 2016లో ఏచూరి చెప్పినది తాను ఎంతో అభిమానించే నారాయణన్ అవగాహనను ప్రతిబింబించింది. సామాజిక న్యాయ కార్యక్రమంలో భాగంగా వర్తమానంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం.
18వ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఃఈసారి 400కి పైగాః అనే మోడీ నినాదం రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లకు ముగింపు పలకడానికి ఎన్నికల వ్యూహంగా ఉండటం బీజేపీ ఆధ్వర్యంలో సాగుతున్న మోడీ పాలన రాజ్యాంగ అస్తిత్వానికి ముప్పు తెచ్చిపెట్టిందని 2016లో రాజ్యసభలో ఏచూరి చేసిన ప్రసంగ సారాన్ని ప్రతిబింబించింది. 2024లో రాజ్యాంగ అస్తిత్వం ప్రమాదంలో ఉందని ప్రజలు వ్యక్తం చేసిన భయాన్ని భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటుఃః అని 2016లోనే రాజ్యసభలో ఏచూరి పేర్కొన్నాడు. ఈ తిరుగుబాటు లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని మతతత్వ హిందూ రాష్ట్రంగా మార్చడంః అనే లక్ష్యంతో సాగుతోందని ఆయన అన్నాడు.
రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ చెప్పిన మాటలను ఏచూరి ఉటంకించాడు: రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. మన సామాజిక, ఆర్థిక నిర్మాణం కారణంగా, మన సామాజిక, ఆర్ధిక జీవితంలో ఒక మనిషి ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరించడం కొనసాగిస్తాం. ఒక వ్యక్తి ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక విలువగా మారకపోతే రాజకీయ వ్యవస్థ, నిర్మాణం ముక్కలవుతుందని అంబేద్కర్ చేసిన హెచ్చరికలను ఏచూరి గుర్తు చేశాడు.
ఇలా కామ్రేడ్ సీతారాం ఏచూరి భారత రాజకీయ వ్యవస్థలో అరుదైన సునిశితను, సంఘీభావ సంస్కృతిని, సమరశీలతను ప్రదర్శించాడు. కామ్రేడ్ సీతారాం ఏచూరి పీడిత ప్రజల విముక్తి పోరాటాలు కొనసాగినంత కాలం వేగుచుక్కగా కాంతిని వెదజల్లుతూ మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాడు.
– నెల్లూరు నరసింహారావు,
సీనియర్ పాత్రికేయులు