నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీతారాం ఏచూరి మృతి సీపీఐ(ఎం)కే కాకుండా దేశంలోని కార్మికవర్గానికి, కష్టజీవులకు తీరని లోటు అని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతికి ఉద్యమ జోహార్లు అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐలో సాధారణ కార్యకర్త నుంచి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. దేశ రాజకీయ నాయకులే కాకుండా విదేశాల్లోని మేధావులంతా గుర్తించే, గౌరవించే నేతగా కీర్తిగడించారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగిన పోరాటాలకు మార్గదర్శకత్వం వహించారని తెలిపారు. ఏచూరి ఆశయసాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.